AP BJP Social Media : ఏపీ బీజేపీ సోషల్ మీడియా ఇంచార్జిగా విష్ణువర్ధన్ రెడ్డి - ప్రధాన పార్టీలకు ధీటుగా పోటీపడేందుకు ప్రణాళిక !
ఏపీ బీజేపీ సోషల్ మీడియా ఇంచార్జిగా విష్ణువర్దన్ రెడ్డిని నియమించారు. ప్రధాన పార్టీలకు ధీటుగా సామాజిక మాధ్యమాల్లో తమ వాయిస్ వినిపించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
AP BJP Social Media : ఆంధ్రప్రదేశ్ బీజేపీ సోషల్ మీడియాలోనూ ప్రధాన పార్టీలకు పోటీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా కమిటీలను.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నియమించారు. భారతీయ జనతా పార్టీ సామాజిక మాధ్యమాల్లో విస్తరణే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల రాష్ట్ర ఇన్‌ఛార్జిగా, పార్టీ సీనియర్ నేత , పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్విష్ణువర్ధనరెడ్డిని నియమించారు. ఈ మేరకు బాధ్యతను అప్పగించినట్లుగా సోము వీర్రాజు అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్ర కన్వీనర్‌గా విశాఖకు చెందిన భా కేశవకాంత్‌ని నియమించారు. నలుగురు కో కన్వీనర్లను, నలుగురు జోనల్ ఇన్‌ఛార్జులను, ముగ్గురిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించారు.
తదుపరి ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా, రెండు అవినీతి కుటుంబ పార్టీల ఆటకట్టించే దిశగా నూతన సోషల్ మీడియా కమీటీని నియమించిన @BJP4Andhra అధ్యక్షులు శ్రీ @somuveerraju గారు pic.twitter.com/rtAAnkcvOQ
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) December 28, 2022
రానున్న రోజుల్లో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్, పార్టీ ప్రత్యేకంగా డిజిటల్ మాధ్యమంలో ఒక పత్రిక ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసే అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, పార్టీ రాష్ట్రం లో చేసే కార్యక్రమాలను ప్రచారం చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ నూతన కమిటీకి ఈ నూతన బాధ్యతను అప్పజెప్పినట్లు బీజేపీ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీకి దేశ స్థాయిలో సోషల్ మీడియాలో మంచి నెట్ వర్క్ ఉంది. అయితే ఏపీలో మాత్రం కాస్త వీక్ గా ఉంది. జాతీయ అంశాలను ఎప్పటికప్పపుడు హైలెట్ చేస్తున్నారు కానీ.. రాష్ట్ర స్థాయిలో అంశాలను ప్రభావ వంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది. అలాగే తమ పోరాటాలను.. కూడా చురుగ్గా సోషల్ మీడియా ద్వారా యువతకు చేర వేయడంలో మరింత చురుకుగా ఉండాలని విష్ణువర్ధన్ రెడ్డికి ఈ అంశాలను చూసుకునే బాధ్యత అప్పగించినట్లుగా తెలుస్తోంది.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విష్ణువర్థన్ రెడ్డి చురుకైన యువనేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన బీజేపీని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఉంటారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆరు వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించింది. ఇవన్నీ విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలోనే జరిగాయి. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను కలిసి మరీ .. కేంద్రం చేస్తున్న మంచి .. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కీడును వివరించారు. ఈ ప్రయత్నాలను హైకమాండ్ కూడా మెచ్చింది. ఎలాంటి బాధ్యత ఇచ్చినా విష్ణువర్ధన్ రెడ్డి పక్కాగా నిర్వహిస్తూండటంతో.. ఇప్పుడు సోషల్ మీడియా బాధ్యతలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుత రాజకీయంలో సోషల్ మీడియా అన్నది అత్యంత కీలకంగా మారింది. అన్నిరాజకీయ పార్టీలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి... ప్రత్యేకంగా సోషల్ మీడియా సైన్యాలను నడుపుతున్నాయి. అదే సమయంలో ... స్ట్రాటజిస్టులను కూడా పెట్టుకుంటున్నారు. కానీ బీజేపీ మాత్రం పూర్తిగా కార్యకర్తలనే నమ్ముకుంటోంది. వారైతేనే బీజేపీ భావజాలాన్ని పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్లగరని అనుకుంటోంది.