Atchutapuram SEZ Accident: అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి, రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్
Fire Accident At Atchutapuram SEZ | అనకాపల్లి జిల్లాలోన అచ్యుతాపురం సెజ్ లో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలడంతో కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
YS Jagan express condolences for the victims of Atchutapuram SEZ Accident | అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలుడుతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతిచెందారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు కార్మికులు మరణించడంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు. రియాక్టర్ పేలుడుతో సెజ్ ప్రాంతం భయానకంగా మారిపోయింది. తమకు దిక్కెవరంటూ బాధిత కుటుంబాలకు చెందిన వారు రోదిస్తున్నారు.
ఎల్జీ పాలిమర్స్ లాగే రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్
గతంలో వైయస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వం హయాంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే కూటమి ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలన్నారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలన్నారు. వైసీపీ నాయకుల బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుందన్నారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 21, 2024
మధ్యాహ్న భోజన సమయంలో ఒక్కసారిగా పేలుడు
అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో ప్రమాదం సంభవించిది. ప్రమాదంలో గాయపడ్డ వారిని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి, స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని అంతా అనుకున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఎం చంద్రబాబు గురువారం నాడు అచ్యుతాపురం సెజ్ లో పర్యటించనున్నారు.
శుక్రవారం నాడు అచ్యుతాపురం సెజ్ కు వైఎస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం (ఆగస్టు 23) నాడు అచ్యుతాపురం సెజ్ ను సందర్శించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. దాంతో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో మాజీ సీఎం జగన్ ఎల్లుండి ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: Atchutapuram SEZ Death Toll: పేలుడు ఘటన మరింత సీరియస్! పెరుగుతున్న మృతులు - రేపు చంద్రబాబు పర్యటన