Vizag Politics: విశాఖ వైసీసీ ఈస్ట్ పంచాయతీ విజయవాడకు, అక్కరమానికి సజ్జల నుంచి పిలుపు!
Vishakapatnam East: విశాఖ తూర్పు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన, ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా ఉన్న అక్కరమాని విజయనిర్మలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు చెబుతున్నారు.
Vishakapatnam East Constituency Cold War in YSRCP: విశాఖ నగర పరిధిలోని నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలను పరిష్కరించే దిశగా వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. తొలుత తూర్పు నియోజకవర్గంపై దృష్టి సారించినట్టు చెబుతున్నారు. అందులో భాగంగానే తూర్పు నియోజకవర్గం నుంచి గడిచిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన, ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అక్కరమాని విజయనిర్మలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఆమె సమావేశం కానున్నారు. ఈ మేరకు పార్టీ కీలక నాయకులు సమాచారాన్ని వెల్లడించారు. గడిచిన కొద్దిరోజులు నుంచి అక్కరమాని దంపతులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇక్కడి సమస్యను పరిష్కరించే ఉద్ధేశంతోనే పార్టీ అధిష్టానం అక్కరమాని దంపతులను పిలిచినట్టు చెబుతున్నారు.
తూర్పు సమన్వయకర్తగా ఎంవీవీ సత్యనారాయణ
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా అక్కరమాని విజయ నిర్మల పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. ఓటమి పాలైనప్పటికీ నియోజకవర్గంలో ఉంటూ దూకుడుగా ఆమె వ్యవహరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు వీఎంఆర్‌డీఏ చైర్మన్ పదవిని అధిష్టానం కట్టబెట్టింది. ఎమ్మెల్యే వెలగపూడి విజయాలకు అడ్డుకట్ట వేయాలని భావించిన అధిష్టానం వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలో దించాలని భావించింది. అందుకు అనుగుణంగానే సిటింగ్ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించింది. ఆయన జోరుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయనకు బాధ్యతలు అప్పగించిన తరువాత తూర్పు వైసీపీలో ఒక్కసారిగా లుకలుకలు పెరిగిపోయాయి. అప్పటి వరకు జోరుగా రాజకీయం చేసిన అక్కరమాని విజయనిర్మల దంపతులు సైలెంట్ అయిపోయారు. ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆకాంక్షించిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పార్టీ మారిపోయారు. దీంతో ఇక్కడి సమస్యను పరిష్కరించడంపై పార్టీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే విజయ నిర్మలకు పిలుపు వచ్చినట్టు చెబుతున్నారు.
సమస్యలు సర్ధుకుంటాయా
తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఎంపీ ఎంవీవీని నియమించినప్పటి నుంచి అక్కరమాని దంపతులు పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభకు కూడా రాలేదు. ఇది ఒకరకంగా పార్టీకి ఇబ్బందికరమైన అంశంగానే భావించాలి. మొన్నటి వరకు పార్టీలోనే ఉన్న వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ పార్టీ విడిచి పెట్టి జనసేనలో చేరారు. ఈ పరిణామాలన్నీ తూర్పులో వెలగపూడిని ఓడించాలన్న వైసీపీ అధినాయకత్వానికి ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఇక్కడ ఉన్న లుకలుకలను పరిష్కరించి కేడర్‌ను ఏకతాటిపైకి వచ్చేలా చేయడంపై అధినాయకత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో అక్కరమాని దంపతులకు ఏం హామీ ఇస్తారన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. తూర్పులో మార్పు చేస్తారా..? మరో చోట వీరికి అవకాశం కల్పిస్తారా..? అన్నది చూడాల్సి ఉంది. సజ్జలతో చర్చలు అనంతరం దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.