Tiger In Visakha: మకాం మార్చిన పెద్దపులి, చోడవరంలో మళ్లీ గాండ్రింపు - ఈసారైనా పట్టుకునే ఛాన్స్ ఉందా !
Tiger spotted In Visakha: ఏపీలోని ఉమ్మడి విశాఖ, కాకినాడ జిల్లాలను పులి సమస్య వెంటాడుతోంది. తాజాగా చోడవరంలో పులి ప్రత్యక్షమైంది. అటవీశాఖ అధికారులు అంతా సెట్ చేశారు. పులి రావడమే ఆలస్యం అని చెబుతున్నారు.
కొన్ని రోజుల కిందట జాడ లేని పెద్దపులి మళ్లీ వచ్చింది. గత 53 రోజులుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోనే సంచరిస్తున్న రాయల్ బెంగాల్ టైగర్ మళ్ళీ జనావాసాలకు దగ్గరగా వచ్చింది. సోమవారం నాడు చోడవరం సమీపంలోని కె . కోటపాడు రోడ్డులో సీమునపల్లి గ్రామంలో పెద్దపులి సంచారం ఒకరికి కనిపించింది. పక్కగ్రామం గుల్లిపల్లికి చెందిన కె .రమణ అనే వ్యక్తి తన బైకుమీద రాయపురాజు పేటకు వెళుతుండగా, సీమునపల్లె గ్రామం వద్ద పెద్దపులి రోడ్డు క్రాస్ చేస్తూ కనిపించింది. దాంతో భయపడిన రమణ రాయపురాజు పేట బొడ్డేడ రామునాయుడుకు సమాచారం అందించడంతో ఆయన వెంటనే ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు ఫోన్ చేసి వివరాలు తెలిపారు.
అలెర్ట్ అయిన పోలీసులు సీమునపల్లె సహా సమీప గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. అలాగే చోడవరం సీఐ తాతారావు ,ఎస్సై విభూషణరావు, ఫారెస్ట్ అధికారులు అన్ని సమీప గ్రామాల్లోనూ మైక్ తో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేశారు. ఒంటరిగా ఎవరూ తిరగవద్దనీ, రాత్రిపూట పశువులను పాకల్లో కాకుండా.. ఇళ్లవద్దే కట్టెయ్యలంటూ సూచించారు. అలాగే పులికి సంబంధించిన ఏ వివరాలు తెలిసినా సరే వెంటనే పోలీసులకు గానీ, ఫారెస్ట్ అధికారులకు గానీ వెంటనే సమాచారం ఇవ్వాలని వారు ప్రజలకు సూచించారు.
అంతకు ముందు రోజు చింతపాలెం లో ఎద్దును చంపిన పులి
గత కొన్నిరోజులుగా సైలెంట్ గా ఉన్న పులి మళ్ళీ వేటకు వస్తుందన్న ఫారెస్ట్ అధికారుల అంచనాలకు అనుగుణంగా పెద్దపులి మొన్న చింతపాలెంలో ఓ ఎద్దును చంపింది. గంధవరంలో గేదెనూ, మేకలనూ చంపితిన్న తరువాత మూడు రోజులపాటు పులిజాడ కనపడలేదు. దాంతో ఆకలితో మళ్ళీ పులి వేటకు రావడం ఖాయం అని అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్టే ఆదివారం ఎద్దును చింతపాలెంలో చంపి తినేసింది. గంధవరంలో చంపిన గేదె కళేబరం కోసం పులి మళ్ళీ వచ్చినట్టే.. చింతపాలెంలో కూడా ఎద్దు కళేబరం కోసం వస్తుందని ఫారెస్ట్ సిబ్బంది భావించి ట్రాప్ సెట్ చేసారు. అయితే పులి ఆ వైపునకు రాకుండా చోడవరం సమీప గ్రామాలకు వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో తేలిసింది. దాంతో రంగంలోకి దిగిన అధికారులు సీమునపల్లె ప్రాంతంలో పులిని పట్టుకునేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే ఎక్కడిక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు.. పెద్ద పులికి మత్తుమందు ఇచ్చి పట్టుకునేందుకు ఆరుగురు నిపుణులను ట్రాంక్విలైజర్ గన్స్ తో సహా సిద్ధం చేశారు. పులివల్ల జనాలకు హాని లేకుండా చూడడంతోపాటు ప్రజల నుంచి సైతం పులికీ హానిలేకుండా చూడడం తమ లక్ష్యం అని వైజాగ్ రీజియన్ అటవీ శాఖ అధికారి అనంత్ శంకర్ అంటున్నారు.