జనవరి 4న విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్- ఎంట్రీలను ఆహ్వానించిన జ్యూరీ
ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఫౌండర్ పులగం రామచంద్రారెడ్డి తెలిపారు.
వైజాగ్‌లో జనవరి 4న విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. దీనిలో కొత్త దర్శకులు రూపొందించిన సినిమాలను ప్రదర్శించి విజేతలకు అవార్డులను ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దీని కోసం ఇప్పటికే ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్టు వారు తెలిపారు.
ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఫౌండర్ పులగం రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరిన 4న విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుందని చెప్పారు.
తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సినిమా రంగంలో 24 విభాగాలకు చెందినవారు సినిమాలు, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్‌లను ఈనెల 28 లోపు పంపించాలని చెప్పారు రామచంద్రారెడ్డి. విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్ కమిటీ పర్యవేక్షణలో ఎంపిక చేసిన వారికి ప్రముఖుల ద్వారా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతిభా వంతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు విశాఖ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మూవీ మేకర్స్, షార్ట్ ఫిలిం మేకర్స్ అందరు కూడా ఫెస్టివల్ కు తమ ఎంట్రీలను పంపించాలని కోరారు. మంచి కాన్సెప్ట్లతో ఫిలిమ్ లకు కచ్చితంగా ఆదరణ ఎక్కువగా ఉంటుందని అన్నారు. అటువంటి చిత్రాలకు పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రముఖ న్యాయవాది డాక్టర్ జాలాది విజయ మాట్లాడుతూ ఔత్సాహక ఫిలిం మేకర్స్ కు, షార్ట్ ఫిలిం మేకర్స్ కు ఇదొక మంచి అవకాశం అని తెలిపారు. తప్పకుండా అందరూ ఈ ఫెస్టివల్ పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారని, వారి చేతుల మీదుగా విజేతలకు అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ తామాడ శ్రీనివాసు, సినీ రైటర్, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఐనాడ దుర్గాప్రసాద్, ప్రముఖ నిర్మాత, నటులు తమ్మినేని జనార్ధనరావు, ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.కృష్ణ కిషోర్ పాల్గొని మాట్లాడారు.