విశాఖలో పీక్స్‌కు చేరిన రాజకీయ రియల్ ఎస్టేట్- ఎంపీల మధ్య భూ బాగోతం-
విశాఖలో ఎంపీల మధ్య భూబాగోతం. అధికార వైసీపీలో రియల్ ఎస్టేట్ వార్ అంటున్నారు జనం. ఇంతకీ సాగర్ సిటీలో ఏం జరుగుతోంది. .. లోకల్ నాన్ లోకల్ ఎంపీల మధ్య ఎందుకిిలా జరుగుతోంది.
ఓ పక్క విశాఖను పరిపాలన రాజధానిగా ఎట్టిపరిస్థితుల్లోనూ చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే అదే సమయంలో విశాఖలో అధికార పార్టీ కీలక నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లోనే ఈ విభేదాలు, ఈగోలు తారాస్థాయికి చేరుకున్నట్టు వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. చాలాకాలం నుంచే స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య సఖ్యత లేని పరిస్థితి ఉంది. అయితే, ప్రస్తుతం ఈ విభేదాలు పీక్‌కు చేరుకున్నట్టు జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి .
దసపల్లా భూముల్లో విజయసాయిపై ఆరోపణలు
విశాఖలో దశాబ్దాల నాటి దసపల్లా భూముల వ్యవహారంలో కోర్టు తీర్పు ఇచ్చేసింది. ప్రస్తుతం ఆ భూముల వెనుక విజయసాయి ఉన్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్కడి భూమి యజమానులతో 30:70 నిష్పత్తిలో అంటే స్థలం ఓనర్‌కు 30 శాతం, బిల్డర్‌కు 70 శాతం అన్నట్టు ఒప్పందాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. ఏపీ మొత్తం రాజకీయ చర్చ సాగుతోంది. అయితే ఈ ఆరోపణల వెనుక స్థానిక ఎంపీ పాత్ర కూడా ఉన్నట్టు విజయసాయి వర్గం భావిస్తుంది .
కూర్మన్నపాలెం భూముల అగ్రిమెంట్ తెరపైకి తెచ్చిన విజయసాయి
తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూనే విజయసాయి రెడ్డి విశాఖ వేదికగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నగర శివార్లలోని కూర్మన్నపాలెం వద్ద గల ఒక స్థలం డెవలెప్‌మెంట్‌లో ఏకంగా 1:99 శాతం అగ్రిమెంట్ జరిగింది అనీ ఒక శాతం భూమి యజమానికి ఇచ్చి 99 శాతం బిల్డర్ తీసుకోవడం ఏంటో సీఏ చదివిన తనకు అర్ధం కావడం లేదంటూ విజయ సాయిరెడ్డి సెటైర్లు వేశారు. దసపల్లా భూముల వ్యవహారంలో 30:70 అంటూ ఆరోపణలు తనపై జరుగుతున్నాయని.. కానీ కూర్మన్నపాలెంలో ఏకంగా 1:99 నడుస్తుంది అంటూ ఇష్యూను ఎంపీ ఎంవీవీ వైపు డైవర్ట్ చేశారు. దీనితో వైజాగ్‌లోని వైసిపీ కీలక నేతల మధ్య గల విభేదాలు బజారున పడ్డాయి.
వైజాగ్‌లో రియల్ ఎస్టేట్ రాజకీయం
గత కొన్నేళ్లుగా హద్దూపద్దూ లేకుండా విశాఖలో పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ ధరలు పాలనా రాజధాని వస్తుందన్న ప్రభుత్వ ప్రకటనలతో మరింత ఊపందుకున్నాయి. వైజాగ్ కాదుకదా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ సామాన్యుడు సెంటు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. ఖాళీ స్థలం కనపడితే చాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాలిపోతున్నారు. దానికి తోడు రాజకీయ నేతల జతగా ఉండటతో వారు ఆడిందే ఆట. ఈ రియల్ ఎస్టేట్ గొడవలు ఏకంగా ఒకే పార్టీలోని కీలక నేతల మెడకు చుట్టుకోవడం, ఒకరిపై ఒకరు పరోక్ష, ప్రత్యక్ష విమర్శలకు దిగుతుండడం విశాఖ రాజకీయాల్లో తాజాగా మంట పెడుతుంది .