విజయనగరంలో టీడీపీకి పునర్ వైభవం వస్తుందా ? అప్పల నర్సయ్యకు కొండపల్లి ఫ్యామిలీ చెక్ పెడుతుందా ?
విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే...ఆరు స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించింది.
Ap Assembly Elections : తెలుగుదేశం (Tdp) పార్టీ విజయనగరం (Viziangaram)జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే...ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక స్థానాన్ని జనసేన (janasena)కు కేటాయించింది. విజయనగరం నియోజకవర్గం నుంచి పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు...టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆమెపై సిట్టింగ్ ఎమ్మెల్యే కొలగంట్ల వీరభద్రస్వామి...అధికార పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి పూసపాటి కుటుంబమే ఆధిపత్యం చలాయిస్తోంది. పూసపాటి విజయరామ గజపతి రాజు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 నుంచి 1999 వరకు పూసపాటి అశోక్ గజపతి రాజు గెలుపొందారు. 2004లో ఓటమి పాలయిన అశోక్ గజపతిరాజు...2009 ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. టీడీపీ తరపున ఆరుసార్లు, ఒకసారి జనతా పార్టీ తరపున అశోక్ గజపతిరాజు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మీసాల గీత...టీడీపీ తరపున విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటయిన తర్వాత...రెండు సార్లు మాత్రమే ఓడిపోయింది. ప్రస్తుత ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి 2004లో ఇండిపెండెంట్‌గా, 2019లో వైసీపీ తరపున గెలుపొందారు.
అప్పల నర్సయ్యకు కొండపల్లి ఫ్యామిలీ చెక్ పెడుతుందా ?
గజపతినగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్...తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనపై వైసీపీ తరపున మంత్రి బొత్స సత్యనారాయణ తమ్ముడు అప్పల నర్సయ్య బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటి దాకా 15 ఎన్నికలు జరిగాయి. ఐదు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందగా...నాలుగుసార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. అప్పల నర్సయ్య 2009లో కాంగ్రెస్ తరపున, 2019లో వైసీపీ తరపున గెలుపొందారు. బొబ్బిలి నియోజకవర్గంలో బేబి నాయన...తెలుగుదేశం పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. వైసీపీ తరపున శంబంగి చిన వెంకట అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. అప్పలనాయుడు...1983,1985, 1994లో తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన...2019లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా నాలుగోసారి విజయం సాధించారు.
కురుపాంలో జగదీశ్వరి
ఎస్టీ రిజర్వ్‌ర్డ్ కురుపాం నియోజకవర్గం సీటును తోయక జగదీశ్వరిని అభ్యర్థిని ఖరారు చేసింది. వైసీపీ తరపున మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి నియోజకవర్గ సమన్వయ కర్తగా పని చేస్తున్నారు. పుష్ప శ్రీవాణి...2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందారు. సాలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి...టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర బరిలోకి దిగుతున్నారు. రాజన్నదొర...తొలిసారి 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో గెలుపొంది..హ్యాట్రిక్ కొట్టారు. ఈ నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే...తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు గెలుపొందింది. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు సార్లు చొప్పున విజయం సాధించాయి.
పార్వతీపురంలో బోనెల విజయ్
పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ తరపున బోనెల విజయ్ బరిలోకి దిగుతున్నారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే...ఐదు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2019లో బొబ్బిలి చిరంజీవులుపై అలజంగి జోగారావు గెలుపొందారు. నెలిమర్ల సీటును తెలుగుదేశం పార్టీ...మిత్రపక్షమైన జనసేనకు కేటాయించింది. ఆ పార్టీ తరపున లోకం మాధవి పోటీ చేయనున్నారు. లోకం మాధవి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.