Visakha Parliamentary Constituency: సాగర నగరంలో హోరాహోరీ- ప్రజల మనసులు గెలిచేందుకు ఝాన్సీ, భరత్ ప్రయత్నాలు
Botsa Jhansi And Bharat : సాగర నగరంలో హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. ట్రాక్ రికార్డులు వివరిస్తూ ప్రజల మనసు గెలిచేందుకు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Andhra Pradesh Elections 2024: విశాఖ ఎంపీ స్థానంలో జరుగుతున్న పోరు హోరాహోరీగా ఉంటోంది. ఈ పార్లమెంట్ బరిలో చాలా మందే ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి అభ్యర్థుల మధ్యే ఉంది. ఇద్దరి రాజకీయ నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. కచ్చితంగా విజయం సాధించాలన్న కసితో ఇరువురు అన్ని బలాలను ప్రయోగిస్తున్నారు.
వైసీపీ తరఫున విశాఖ పార్లమెంట్ స్థానంలో మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు. కూటమి తరఫున టీడీపీ లీడర్ మాజీ ఎంపీ భరత్ బరిలో ఉన్నారు. మిగతా పార్టీల నుంచి చాలా మందే ఉన్నప్పటికీ వాళ్లది నామమాత్రపు పోటీగా చెప్పుకుంటున్నారు.
విశాఖలో పోటీ ఝాన్సీ, భరత్ మధ్యే ఉండటం... ఇద్దరూ ఒక్కోసారి ఎంపీలుగా చేసిన అనుభవం ఉండటంతో ఆ పని తీరు ఆధారంగానే ఇరువురు ప్రచారం చేసుకుంటున్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు చేపట్టిన పనుల ప్రోగ్రెస్ రిపోర్టును బొత్స ఝాన్సీ ప్రజల ముందు ఉంచుతున్నారు. వైసీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమం కొనసాగాలంటే తమకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంపీగా ఉన్న టైంలో పార్లమెంట్ వేదికగా ప్రజల సమస్యలను ప్రస్తావించిన అంశాన్ని ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఎంపికైన ఎంపీలు ఎవరూ అంతలా ప్రజా సమస్యలు పార్లమెంట్‌లో చెప్పలేదని అంటున్నారు. ఇప్పటికీ ఆ విషయాలు పార్లమెంట్ మినిట్స్ బుక్‌లో ఉంటాయని గుర్తు చేస్తున్నారు. విశాఖలో పోటీ చేస్తున్న వాళ్లెవరూ స్థానికులు కాకపోయినా... తాము మాత్రం చాలా దగ్గరి వాళ్లమని ఝాన్సీ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా కూటమిపై ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ అభ్యర్థి భరత్‌పై నిప్పులు చెరుగుతున్నారు. వాళ్లంతా ప్రత్యేక హెలీకాప్టర్లలో వచ్చి వెళ్లిపోయే వాళ్లు తప్ప ప్రజల బాగోగులు చూసే వాళ్లు కాదని అంటున్నారు. సమస్య వస్తే దగ్గరి వాళ్లే వస్తారని మిగతా వాళ్లు రారని అంటున్నారు.
ఝాన్షీకి ధీటుగా భరత్ ప్రచారం చేస్తున్నారు. గత ఎంపీ హయాంలో జరిగిన ఘటనలు, రుషికొండ వివాదంలాంటి అంశాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకహోదా కోసం కొట్లాడిన విషయాన్ని ప్రజలకు తెలిపారు. అదే ప్రత్యేక హోదా పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎంపీలు ఒక్కరు కూడా దాని కోసం పోరాడలేదని గుర్తు చేస్తున్నారు. ఇలా ఇరువురు నేతల ప్రచారంతో సాగరనగరం వేడెక్కింది.