Vizag TCS: విశాఖకు టీసీఎస్ - మిలీనియం టవర్స్ లో క్యాంపస్ రెడీ - 2వేల మందితో త్వరలో స్టార్ట్
TCS office : విశాఖలో టీసీఎస్ కార్యాలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. తొలుత రెండు వేల మంది ఇక్కడ ఉద్యోగం చేయనున్నారు.

TCS office in Visakhapatnam: విశాఖపట్నంలో టీసీఎస్ కార్యకలాపాలు మిలీనియం టవర్స్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ కార్యాలయం రుషికొండ ఐటీ పార్క్‌లోని మిలీనియం టవర్స్‌లో తాత్కాలిక భవనంగా పనిచేస్తుంది. ఇది సెప్టెంబర్ 2025 నుండి కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. దానికి తగ్గట్లుగా ఆఫీసును రెడీ చేస్తున్నారు.
టీసీఎస్ మిలీనియం టవర్స్‌లో 2,000 సీట్ల సామర్థ్యంతో ఒక డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టవర్స్‌లో 2.08 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని టీసీఎస్‌కు కేటాయించారు. ఇందులో టవర్ A ఎగువ నాలుగు అంతస్తులు టీసీఎస్ కోసం రిజర్వ్ చేశారు. టవర్ Bలోని ఎనిమిది అంతస్తులు కూడా భవిష్యత్తులో టీసీఎస్‌కు కేటాయించే అవకాశం ఉంది.
రుషికొండలోని ఈ ఐటీ పార్క్‌లోని మిలీనియం టవర్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ)లో భాగంగా ఉంది. దేశీయ సేవలను అందించడానికి ఈ టవర్స్‌ను SEZ నుండి డీనోటిఫై చేయడానికి ఢిల్లీలోని బోర్డు ఆఫ్ అప్రూవల్స్ (BOA) ఆమోదం ఇచ్చింది. ఈ నిర్ణయం టీసీఎస్‌కు తక్షణ కార్యకలాపాలను ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసింది. ప్రస్తుతం, టీసీఎస్ ఇంటీరియర్ పనులను పూర్తి చేసే పనిలో ఉంది.
టీసీఎస్ రుషికొండలోని హిల్ నంబర్ 3లో 21.6 ఎకరాల స్థలంలో శాశ్వత ఐటీ క్యాంపస్‌ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్యాంపస్ నిర్మాణం కోసం రూ. 1,370 కోట్ల పెట్టుబడితో 12,000 మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించే లక్ష్యంతో ఉంది. ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) టీసీఎస్‌కు లీజుకు కేటాయించింది. ఈ క్యాంపస్ నిర్మాణం పూర్తి కావడానికి 3-4 సంవత్సరాల సమయం పట్టవచ్చని, అందువల్ల తాత్కాలికంగా మిలీనియం టవర్స్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారని అధికారులు తెలిపారు.
Here are the pictures of TCS at Millennium towers, Hill #3, Vizag and looks like they are still working on the interiors #Vizag #TCS #VizagIT https://t.co/OgToVfJ3RG pic.twitter.com/eXHHBkXxk1
— Narendra Nerla (@nerlanr) August 28, 2025
టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభించే ఈ కార్యాలయం ఉత్తరాంధ్ర ప్రాంతంలోని యువతకు గణనీయమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. ప్రారంభంలో 2,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు మొదలై, భవిష్యత్తులో 10,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంను ఐటీ రాజధానిగా మార్చడానికి కట్టుబడి ఉందని, ఈ దిశగా టీసీఎస్ రాక ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు.
విశాఖలో అతి పెద్ద డేటా సెంటర్ ను పెట్టనున్నట్లుగా గూగుల్ ప్రకటించింది. ఈ పెట్టుబడులను కేంద్రం కూడా అధికారికంగా ప్రకటించింది. త్వరలో గూగల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అలాగే కాగ్నిెజెంట్ సహా పలు ఐటీ కంపెనీలు తమ క్యాంపస్ లు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రభుత్వం వారికి ఆకర్షణీయమైన పారిశ్రామిక రాయితీలు అందిస్తోంది.





















