Turkey Earthquake: టర్కీలో భూకంపానికి వణుకుతున్న శ్రీకాకుళం వాసులు - బిక్కుబిక్కుమంటూ అక్కడే!
శ్రీకాకుళం జిల్లా యువత ఉపాధి కోసం దుబాయ్, సింగ్‌పూర్, అబుదాబి తదితర దేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. కరోనా తర్వాత అరబ్ దేశాలలో ఉపాధి అవకాశాలు, వేతనాలు తగ్గడంతో తుర్కియే వైపు వెళ్లాల్సి వచ్చింది.
విదేశాల్లో జరిగిన పెను భీభత్సం ఉద్దానాన్ని కుదుపుతోంది. ఇందుకు కారణం టర్కీ, సిరియా ప్రాంతాలకు 150 కి.మీ. దూరంలో ఉద్దానం కార్మికులు ఉండటమే. సుమారు 2 వేల మంది వరకు జిల్లా వాసులు అక్కడ ఉపాధి పొందుతున్నారు. అక్కడ భూకంపం వచ్చిందన్న విషయం తెలియగానే ఇక్కడవారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. తమవారికి ఏమైందో తెలియక రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉదయానికి కొంత మంది నుంచి క్షేమ సమాచారం రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ప్రపంచంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా సిక్కోలు వాసులు ఉంటారనే నానుడి మరోసారి రుజువైంది. తుర్కియే (టర్కీ) లో భూకంపం వచ్చిందని తెలిసినా అక్కడ కూడా మన ప్రాంత ప్రజలు ఉంటారని ఎవరూ ఊహించలేదు. కానీ ఏడాది కిందట నుంచి నిర్మాణ రంగానికి సంబంధించిన పనులకు దాదాపు రెండు వేల మంది వరకు యువకులు అక్కడికి వెళ్లారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి గంటన్నర ప్రయాణ దూరంలోనే మన వాళ్లు ఉంటున్నారు. వారు అందరూ ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన వారే. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన యువత ఉపాధి కోసం అక్కడకు వెళ్లి గ్యాస్, ఆయిల్‌కు సంబంధించిన నిర్మాణ రంగంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా యువత ఉపాధి కోసం దుబాయ్, సింగ్‌పూర్, అబుదాబి తదితర దేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. కరోనా తర్వాత అరబ్ దేశాలలో ఉపాధి అవకాశాలు, వేతనాలు తగ్గిపోయాయి. దీంతో తుర్కియే వైపు వెళ్లాల్సి వచ్చింది.
ఆదివారం సెలవు కావడంతో అప్పటి నుంచి పనులు నిలిపివేశారు. సంబంధిత కంపెనీలే భోజనం, వసతి సమకూర్చుతూ వేతనాలు ఇస్తున్నాయి. ఇంతలో ఈ విపత్తు వచ్చింది. మళ్లీ ప్రకంపనాలు వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో వారం రోజుల వరకు పనులు నిలిపివేస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయని కార్మికులు తెలిపారు. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నామని తమ కోసం ఎటువంటి ఆందోళన చెందవద్దని యువకులు పేర్కొన్నారు.
తుర్కియే సమీపంలోని ఓ కంపెనీలో ఉద్దానం ప్రాంతానికి చెందిన 170 మంది పైగా యువకులు పని చేస్తున్నారు. ఉద్దానంలోని బాతుపురం, పెద్దమురారిపురానికి చెందిన బత్తిని శ్రీను, పుచ్చ బాలు, బొడ్డపాడుకి చెందిన తామాడ శ్యామ్, వజ్రపుకొత్తూరు, పలాస, సోంపేట, కవిటి, కంచిలి, సంతబొమ్మాళి, ఇచ్ఛాపురం మండలాలకు చెందిన లక్ష్మీనారాయణ, ఉత్తమ్, శేఖర్, ప్రసాద్, జగదీశ్, వెంకటరమణ, తదితరులు అక్కడే ఉపాధి పొందుతున్నారు. జీవనోపాధికి దేశం కానీ దేశం వెళ్లిన వీరంతా తాము క్షేమంగానే ఉన్నామని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తుర్కియే, సిరియాల్లో రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. రెస్క్యూ సిబ్బంది రాత్రి పగలు అని తేడాలేకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీంతో శిథిలాల కిందినుంచి పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, భూకంపం వల్ల చనిపోయిన వారి సంఖ్య 20 వేలకుపైగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ప్రకటించింది.