Srikakulam: ఇద్దరు మహిళలపై కంకర కుప్ప, ట్రాక్టర్‌తో అమాంతం పోసేసిన వ్యక్తులు - సచ్చిపో పర్లేదు అంటూ చోద్యం!
కొన్ని సంవత్సరాలుగా ఓ ఇంటి స్థలం కోసం కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రి అనే ఇద్దరు మహిళలు న్యాయ పోరాటం చేస్తున్నారు. వీరిద్దరూ తల్లీ కూతుర్లు.

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో అమానవీయ ఘటన జరిగింది. మందస మండలంలోని హరిపురం గ్రామంలో ఇద్దరు మహిళలను చిత్రవధకు గురి చేశారు. ఇద్దరు వయసు పైబడిన మహిళలపై ట్రాక్టర్ తో ఎర్ర కంకర పోసి వారిని చంపబోయారు. స్థానికులు గమనించి వెంటనే కంకరను గడ్డ పారలతో తొలగించి కాపాడారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. నడుము వరకూ వారు ఎర్ర కంకర కుప్పలోనే చిక్కుకుపోయారు. కాళ్లు ఆ కుప్పలోనే ఉండిపోవడంతో కదలలేక పోయారు. ఆ బాధతో ఆర్తనాదాలు చేశారు. ఇదంతా అక్కడే నిలబడి నిందితులు చోద్యం చూస్తూ ఉన్నారు. తాము చనిపోతున్నాం.. బయటకు తియ్యండి అని ఆ మహిళలు రోదిస్తూ వేడుకుంటున్నా వారి మనసు కరగలేదు. పైగా చచ్చిపోండి.. అంటూ కటువుగా మాట్లాడారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఓ ఇంటి స్థలం కోసం కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రి అనే ఇద్దరు మహిళలు న్యాయ పోరాటం చేస్తున్నారు. వీరిద్దరూ తల్లీ కూతుర్లు. దీనికి సంబంధించి 2019 ఏడాదిలో హరిపురంలోనే తల్లి, కుమార్తె ఇద్దరు నిరాహారదీక్షలు చేపట్టారు. అదే ఊరికి చెందిన కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాష్ రావు అనే వ్యక్తులు తమ స్థలం కబ్జా చేస్తున్నారని బాధిత ఇద్దరు మహిళలు ఆరోపిస్తున్నారు. తమకు ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
స్థానికులు రాకుంటే సచ్చిపోయుండేవాళ్లం - బాధితులు
‘‘మా జాగ కోసం ఊళ్లో వాళ్లు కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాష్ రావు అనే వ్యక్తులు వేధిస్తున్నారు. మమ్మల్ని ఊళ్లో నుంచి వెళ్లిపోమ్మని వాళ్లు బలవంత పెడుతున్నారు. మా జాగ దగ్గర మా మీద ట్రాక్టర్ తో కంకర పోసేశారు. నడుము లోతులో మేము కూరుకుపోయాం. బయటికి రావడానికి వీలు పడలేదు. అక్కడే పని చేసేవాళ్లు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కాపాడారు. లేకపోతే సచ్చిపోయి ఉండేవాళ్లం.’’ అని తల్లి అయిన బాధితురాలు మీడియాతో చెప్పారు.
కంకర తెచ్చి మా మీద వేసేసినారు. మమ్ముల్ని ఊరి నుంచి, ఇల్లు నుంచి వెళ్లిపోమ్మంటనారు. అక్కడి వారు వచ్చి మమ్మల్ని కాపాడకపోయి ఉంటే మేము సచ్చిపోయి ఉందుము. మీరే మాకు న్యాయం చెయ్యాలి’’ అని కుమార్తె వాపోయారు.





















