Srikakulam News: ఆ భ్రమలోనే పవన్ కళ్యాణ్, నాతో 3 కి.మీ. నడిచే సత్తా ఉందా? - మంత్రి ధర్మాన
Srikakulam సెగ్మెంటులోని గార మండలం లింగాలవలసలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ఘాటైన వ్యాఖ్యలు చేసి వైసీపీ కేడర్ ను ఉత్తేజ పర్చారు.
పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందంటూ వ్యాఖ్యానించారు. రాజకీయం, నిజ జీవితాన్ని పవన్ కళ్యాణ్ తన సినిమాతో పోల్చుకుంటూ భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితంలో మమేకమై అధికారంతో సంబంధం లేకుండా మీతో ఉన్నామన్నారు. సినిమా వేరు రాజకీయం వేరు అంటూ మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. పవన్ నడుస్తానంటూ అంటున్నారని, నటించమంటే చేస్తారు తప్ప, 64 ఏళ్ల వయసుపైబడిన తనతో కనీసం మూడు కిలో మీటర్లయినా పవన్ నడవగలరా? అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సవాల్ విసిరారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీకాకుళం సెగ్మెంటులోని గార మండలం లింగాలవలసలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ఘాటైన వ్యాఖ్యలు చేసి వైసీపీ కేడర్ ను ఉత్తేజ పర్చారు.
అధికారం రాక ముందు ఏడాదిపాటు జగన్ ప్రజల్లో తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు అడిగనదల్లా చేస్తున్నారని, అది జగన్ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. నాయకుడంటే జగన్ లానే ఉండాలని మంత్రి ధర్మాన హర్షధ్వానాల మధ్య కితాబునిచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అల్పాదాయ వర్గాల ఆనందమే ప్రభుత్వ ధ్యేయమని మూడేళ్లలో సీఎం చేసి చూపించారని కొనియాడారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుసుకుని, తద్వారా ఏమైనా తప్పులుంటే దిద్దుకుంటామని అన్నారు. పాలన పరంగా మార్పులు అవసరమేనని, అయితే ఏడాది పాటు దీన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు.
‘గడపగడపకూ..’ కార్యక్రమం అందుకే..
అందరి అవసరాలు తీర్చే విధంగా కృషి చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. పేద వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా చర్యలు చేపడుతూ, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. వైసీపీకి ఓటు వేయమని అడిగే ముందే చెప్పిన నవరత్నాలు, సంక్షేమ పథకాలు ఇచ్చిన హమీలన్నింటిని అమలు చేసేందుకు సీఎం శ్రమిస్తున్నారన్నారు. మూడేళ్ల కాల వ్యవధిలో 95 శాతానికి పైగా హామీలు అమలు చేసిన ఘనత జగన్కు దక్కుతుందన్నారు. మూడేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకే గడపగడపకూ మన ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇంటికే పథకాలు అందుతున్న చాలా మంది ఏ పథకం శ్రీ ద్వారా ఎంతొచ్చిందనేది కనీసం అవగాహన లేకపోవడం విచారకరమన్నారు.
పెద్ద మొత్తంలో అందుకుంటున్న పథకాలతో కుటుంబ సభ్యులందరికీ అవగాహన ఉండడం లేదని అందుకే తానే స్వయంగా గడపగడపకు వస్తున్నానని అన్నారు. యాభై ఇళ్లకో, వంద ఇళ్లకో పనిచేసే వలంటీర్లు దృష్టి సారించి గ్రామీణ ప్రజలకు అందుతున్న పథకాలపై మరోసారి అవగాహన కల్పించాలని సూచించారు. పథకాల అమలులో లంచగొండితనం ఉందా లేదా? అని ప్రజలకు ప్రశ్నించగా పెద్ద ఎత్తున లేదనే సమాధానం రావడంతో ధర్మాన ఆనందించారు. ఇలాంటి తరుణంలో మరో పార్టీ ప్రభుత్వ వైపు చూడాల్సిన అవసరం లేదనేది మీనుంచే రావాలని ఆయన సూచించారు. మన దేశానికి అవసరమయ్యే వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు.
మన రాష్ట్రంలోనే ప్రత్యేక పాలన - ధర్మాన
విదేశీ సుంకం కట్టాల్సి రావడంతో ధరలు దేశ వ్యాప్తంగా పెరిగాయని చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని విద్యావంతులకు ఇది తెలుసన్నారు. అదే విధంగా పెట్రో, డీజిలు రేట్లు దేశమంతటా పెరుగుతున్నాయనేది ప్రతి ఒక్కరు గమనించాలని దీనికి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పన్నులు విధించరని తెలిపారు. ధరలు కూడా ఒక్కసారి మిగతా ప్రాంతాలతో పోల్చి చూడాలని టీడీపీ నేతలు లేని పోని వ్యాఖ్యలు చేస్తే వాటిని విశ్వసించవద్దని అన్నారు. ఓటేసినా వేయకపోయినా అన్ని కుటుంబాలకూ పథకాలన్నిఅందుతున్నాయన్నారు. మన రాష్ట్రంలోనే ఈ ప్రత్యేక పాలన కొనసాగుతుందన్నారు. అమ్మ ఒడి ద్వారా రూ.15 వేలు ఇస్తున్నామంటే బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండే విధంగా చొరవ తీసుకుంటున్నమన్నారు. మాకు ఓటేస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరువాత ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు.
నిరంతరం మంచి చేసే, మేలు చేసే ప్రభుత్వాలకు సంబంధించి పథకాల అమలు విషయమై ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉండాలన్నారు. ప్రజా చైతన్యంతోనే ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే మంచి పాలన, మంచి పాలకుల రాక అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి అందరు మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ గ్రామంలో కనిపించిన పవన్ కళ్యాణ్ పోస్టర్లో స్థానిక యువకుల ఫొటోలు ఉండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. లింగాలవలస గ్రామం తన సొంతూరు లాంటిదన్నారు. ఇక్కడ ఉన్న వారు తనను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. ఆయన హయాంలో అందజేసిన సంక్షేమ పథకాలను మంత్రి ధర్మాన వివరించారు. అనంతరం గ్రామంలో తన దృష్టి కి వచ్చిన తాగునీటి సరఫరా, సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.