SM Puram Srikakulam: గోల్కొండ నవాబులకు శ్రీకాకుళానికి సంబంధమేంటి ? గత చరిత్రకు సాక్ష్యాలుగా మారిన శిథిలాలు
SM Puram Village of Srikakulam: గోల్కొండ నవాబులకు శ్రీకాకుళానికి సంబంధమేమిటో, ముస్లిం పేరు ఎస్ఎం పురం ఈ ఊరికి ఎందుకు వచ్చిందో, అసలు ఈ నిర్మాణాలేమిటో అన్న కథలను కాలం దాచుకుంది.
Shermuhammadpuram Village Name: పేరు ఎస్ఎం పురం.. పూర్తి పేరు షేర్ మహమ్మద్ పురం. చూసేందుకు సాదాసీదా ఊరు. సగటు సిక్కోలు పల్లె. 16వ నంబర్ పాత జాతీయ రహదారి దాటి శ్రీకాకుళం రోడ్డుపై ఈ ఊరికి వస్తే చెరువు గట్టుపై కొన్ని శిథిల నిర్మాణాలు కనిపి స్తాయి. ఆ ఊరు, ఊరి పేరు, ఆ పేరు వెనుక తీరూతెన్నూ అన్నీ ఈ శిథిలాలే తమలో దాచుకున్నాయి. గోల్కొండ నవాబులకు శ్రీకాకుళానికి సంబంధమేమిటో, ముస్లిం పేరు ఈ ఊరికి ఎందుకు వచ్చిందో, అసలు ఈ నిర్మాణాలేమిటో అన్న కథలను కాలం దాచుకుంది.
నాలుగు శతాబ్దాల కిందట..
అప్పట్లో రాష్ట్రాలు లేవు. ఈ ప్రాంతాన్ని గుల్షనాబాద్ అని పిలిచేవారు. రాచరికపు రోజులు. గోల్కొండ నవాబు వంశంలో చివరి చక్రవర్తి ఆలీ దూత షేర్ మహ్మదాఖాన్ ప్రస్తుత షేర్ మహమ్మద్ పురం (ఎస్ఎం పురం) కేంద్రంగా అప్పట్లో పాలన సాగించారు. ఆయన పేరునే ఈ గ్రామానికి పెట్టారు. షేర మహ్మద్ ఖాన్, వీరి కుటుంబ సభ్యుల పాలన 1604 ప్రాంతంలో కొనసాగింది. పాలనా సౌలభ్యం కోసం ప్రస్తుత ఎస్ఎం పురం కేంద్రంగా అనేక నిర్మాణాలు చేపట్టారు. ఆనాటి నిర్మాణాలు పర్యావరణ పరిరక్షణ, ఏనుగులు, గుర్రాలు సంరక్షణ, తాగునీటి కల్పన వంటి అంశాల ఆధా రంగా ఉంటాయి. వంద ఎకరాల వరకు విస్తీర్ణంలో పెద్ద చెరువును నిర్మించారు. ఈ చెరువు గట్టుపై ఏనుగులు, గుర్రాల సంరక్షణ కోసం భవనం నిర్మిం చారు. దీన్నే స్థానికులు ఏనుగుల దువ్వారం అని పిలుస్తుంటారు.
ప్రవేశ ద్వారం, వెలుపుల రెండు వైపులా ఏనుగులు, 'గుర్రాలు కోసం ప్రత్యేకంగా షెర్లా నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణానికి కొద్ది దూరంలో కోట ఉంటుంది. ఈ కోట విలాసంగా నిర్మించారు. ఇది అప్పటి పాలకుల నివాసం. ఈ నివాసం సమీపంలో వరుసగా ఏడు బావులు ఉంటాయి. మంచి నీటి కోసం, స్నానాల కోసం, గుర్రాలు, ఏనుగులకు నీటితో శుభ్రం చేసేందుకు, దుస్తులు ఉతికేందుకు, మృతి చెందిన ఏనుగులు, గుర్రాలు పూడ్చేందుకు ఇలా నిర్మాణాలు చేపట్టారు. బావులన్నీ రాతి కట్టడాలే. చెరువు పక్కన ఉం డటం వల్ల నీరు ఎప్పుడూ ఉంటుంది. మరో పక్క చెరువు నీరు బావులకు తరలించేందుకు చిన్న కాలువలు సైతం నిర్మించారు. కొన్న దశాబ్దాలు పాటు ఈ నిర్మాణాలు సాగాయి.
ఇప్పుడన్నీ శిథిలాలే..
ప్రస్తుతం ఏనుగు దువ్వారం, నివాస కోటలు శిథిలావస్థకు చేరుకున్నాయి. భవనాల ఆనవాళ్లు మాత్రం ఉన్నాయి. కోట సైతం ఇప్పటికీ ఉంది. వీటి ద్వారాలు, నిర్మాణంలో ఇనుము, ఇతర లోహాలు తవ్వుకుపోవడం వల్ల రాతి కట్టడం మాత్రమే ఉంది. ఏడు బావుల్లో ఐదు బావులు ఉన్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరగా, కొన్న మరమ్మతులు చేసి రైతులు వినియోగిస్తున్నారు. రైతులు పొలాల మధ్యలో నిర్మాణాలు, బావులు ఉండటం, మరో పక్క ఆక్రమణలు గురికావటం వల్ల నిర్మాణాలు శిథిలమవుతున్నాయి.
గత కొన్నేళ్ల వరకు ఈ బావుల్లో నీటిని తాగేవారు కూడా. ప్రస్తుతం సీసాలతో నీరు పట్టుకువెళ్లటం వల్ల వినియోగం తగ్గింది. పర్యవేక్షణ లేకపోవటం, ఈ భూములు. ఎవరైనా కబ్జా చేస్తే కొద్ది రోజులకే వారికి కీడు కలుగుతుందని అక్కడ గ్రామస్థులు కూడా చెబుతున్నారు చరిత్ర ఆనవాళ్లు కొన్నే మిగిలాయి. ఆనాటి పాలకుల పేర్లు సైతం స్థానికంగా కొన్ని గ్రామాలకు ఇంకా ఉన్నాయి. షేర్ మహ్మద్ పురం, ఫరీదుపేట, ఇబ్రహీంబాద్, షేర్ మహ్మద్ పేట వంటి గ్రామాలు ఈ కోవకు చెందినవే.
చరిత్ర చెప్పాలి అంటే ఎస్ఎం పురం గ్రామానికి ఎంతో ఉంది. ఒకప్పుడు బయట సంపద కొల్లగొట్టి ఆ బావులు నిర్మించారని పూర్వీకులు చెబుతుంటారని గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. సొరంగ మార్గం కూడా చాలా పెద్దది ఉందని అయితే గ్రామస్తులు ఎవ్వరూ కూడా అటు వైపు వెళ్లడానికి కూడా భయపడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా వాళ్ల భూముల మీద గాని ఎవరైనా కన్ను వేస్తే ఏదో ఒక రూపంలో మృత్యువు సంభవిస్తుందని అందుకే నవాబుల భూములలోకి వెళ్లరని పెద్దలు చెప్పేవారని గ్రామస్తులు తెలిపారు.