AP News: జగన్ ఎగ్గొట్టిన బిల్లులు సంక్రాంతి కనుకగా విడుదల - వైసీపీ దుష్ప్రచారంపై మంత్రులు ఫైర్
Andhra Pradesh News | ఏపీలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా విడుదల చేసిందని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు అన్నారు.
పాలకొల్లు: గత వైసీపీ ప్రభుత్వంలో బిల్లులు రాక ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, ఈ సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం వాటిని విడుదల చేసిందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో నిర్మించిన గోకులం షెడ్డు, రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రూ.75 లక్షలతో రోడ్లు, మినీ గోకులం నిర్మించాం. పాడి రైతులను ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం మినీ గోకులం పునరుద్ధరించింది. రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ వైసీపీ హయాంలో ఉన్న బకాయిలు, జగన్ ఎగ్గొట్టిన బిల్లులను చంద్రబాబు సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. బకాయిలు రావడంతో పలు వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
వైసీపీ నేతలు ఏం మారలేదు: గొట్టిపాటి రవికుమార్
అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా వైసీపీ నేతల తీరు మారడం లేదని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదని, ప్రజలు సంతోషంగా లేరంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆఖరికి పండుగలను కూడా వదలకుండా దుష్ప్రచారం చేస్తున్నారు.. ఇతర రాష్ట్రాలు, దేశవిదేశాల్లో స్థిరపడిన తెలుగువారు సొంతూళ్లకు వచ్చి సంక్రాంతి చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. గతేడాది గుంతల రోడ్లకు భయపడి రానివారు కూడా ఈసారి సొంతూరుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
గత ఆరు నెలల్లో ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.850 కోట్లతో రహదారులను బాగు చేయించింది. నీటి సరఫరా పెరగడంతో ఈసారి పంటలు కూడా బాగానే పండాయి. పెండింగ్ బకాయిలు మేం చెల్లించాం. అలాగే 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించడంతో అన్నదాతలు సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు. వైసీపీ పెండింగ్ లో పెట్టిన రూ.6,700 కోట్ల బకాయిల విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ డబ్బులు ఖాతాల్లో పడటంతో ప్రజలు సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషం కోసం కూటమి ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్తుంటే అవి చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని’ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
Also Read: Boat Race: ఆత్రేయపురం పడవ పోటీల ఫైనల్లో హైడ్రామా, విజేతలపై ట్విస్ట్ ఇచ్చిన నిర్వాహకులు