Boat Race: ఆత్రేయపురం పడవ పోటీల ఫైనల్లో హైడ్రామా, విజేతలపై ట్విస్ట్ ఇచ్చిన నిర్వాహకులు
Boat Race in Ambedkar district | ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు నిర్వహించారు. వివాదం నెలకొనడంతో రెండు జట్లను అంపైర్లు విజేతను ప్రకటించారు.
Sir Arthur Cotton Boat Race in Ambedkar district | కొత్తపేట: సంక్రాంతి పండుగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన పడవల పోటీల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విజేత ఎవరో తేల్చడంపై వివాదం నెలకొనడంతో ఫైనల్లో పోటీ పడిన రెండు జట్లను అంపైర్లు విజేతను ప్రకటించారు.
కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో సంక్రాంతిని పురస్కరించుకుని సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు నిర్వహించారు. ఇదివరకే సెమీఫైనల్స్ వరకు పూర్తి కాగా, డ్రాగన్ పడవల పోటీల ఫైనల్స్ లో హైడ్రామా చోటు చేసుకుంది. ఉదయం జరిగిన డ్రాగన్ పడవల పోటీల సెమీ ఫైనల్స్ లో రాణించిన పల్నాడు పాంథర్స్, జంగారెడ్డిగూడెం జెయింట్స్ ఫైనల్ చేరుకున్నాయి.
ఫైనల్లో పల్నాడు, జంగారెడ్డిగూడెం జట్లు నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా పోటీ పడ్డాయి. దాంతో విజేత ఎవరో తేల్చడం అంపైర్లకు కష్టతరంగా మారింది. అయితే నిర్వాహకులు మొదటగా జంగారెడ్డిగూడెం జుట్టును తొలుత విజేతగా ప్రకటించగా.. పల్నాడు జుట్టు ఆటగాళ్లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు చర్చించిన నిర్వాహకులు చివరకు రెండు జట్లను పడవ పోటీల్లో విజేతలుగా ప్రకటించారు.
విజేతలుగా నిలిచిన పల్నాడు పాంథర్స్, జంగారెడ్డి గూడెం జెయింట్స్ జట్ల ఆటగాళ్లకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెరొక లక్ష రూపాయల నగదు బహుమతి అందజేసారు. ఇరు జట్ల ఆటగాళ్లకు ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తృతీయ స్థానంలో నిలిచిన ఎన్టీఆర్ ఈగిల్స్ జుట్టు రూ.30 వేలు నగదు బహుమతి, ట్రోఫీ అందుకుంది. ఈ పడవ పోటీలను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఆత్రేయపురం కాలువ గట్లు జనాలతో కిక్కిరిసిపోయాయి.