Vizag Steel Plant: మరోసారి ఎగిసిపడిన విశాఖ ఉక్కు ఉద్యమం, ప్రైవేటీకరణపై నిరసన ప్రదర్శనలు
Steel Plant Agitation: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరసిస్తూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన పాదయాత్ర, కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణ నిరసిస్తూ విశాఖ పరీరక్షణ పోరాట సమితీ మరోసారి ఆందోళన ఉద్ధృతం చేసింది. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న కూర్మన్నపాలెం నుంచి విశాఖ జీవీఎంసీ(GVMC) వరకు మహా పాదయాత్ర చేపట్టింది.
ప్రైవేటీకరణ వద్దు
ఎన్నో పోరాటాలు, ఎందరో మహానుభావుల ప్రాణాత్యాగాలు అర్పించి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్(Steel Plant) ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మికులు మరోసారి భగ్గుమన్నారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావించిన విశాఖ(Vizag) ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ...ఉద్యమాన్ని ఉద్ధృతం చేసింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు సైతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాట్లు మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యులు, ఉక్కు కర్మాగారం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్మికుల ఆందోళనకు విపక్షాలు సహా ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ ఉమ్మడి రాష్ట్రంలో పెద్దఎత్తు ఎగిసిపడిన ప్రజా ఉద్యమ ప్రతిఫలమే రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్. (RINL) తమనంపల్లి అమృతరావు మరణ నిరాహారదీక్షతో దిగొచ్చిన కేంద్రం 1970 ఏప్రిల్ 17 న విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6వేల ఎకరాలు దానం చేశారు. 1971 జనవరి 20న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేతులు మీదుగా కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఎన్నో ప్రయత్నాల అనంతరం1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) ఏర్పడింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్, భారతీయ ఉక్కు సంస్థ (SAIL) నుండి, విడివడి RINL గా గుర్తింపు పొందింది..33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారతదేశంలోని తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. అయితే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకిరంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సైతం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. సొంతంగా ఉక్కు గనులు లేకున్నా...లాభాల్లో నడుస్తున్న ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరిస్తామన్న నిర్ణయం వెలువడిన వెంటనే పెద్దఎత్తున ఉద్యమం ఎగిసిపడింది. కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. వీరికి వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి.
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దాదాపు ఏడాదిన్నర పాటు నిరసన దీక్షలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటడంతో...కేంద్రం తాత్కాలికంగా కొంత వెనక్కి తగ్గింది. విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం ప్రభుత్వరంగ సంస్థ మాత్రమే కాదని..తెలుగు ప్రజల ఆస్తిని ఎంతోమంది భావోద్వేగాలకు ప్రతీకని కార్మికులు తెలిపారు. కర్మాగారం ఆధీనంలో ఉన్న వేలాది ఎకరాల భూములను కాజేసేందుకే ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్నారని మండిపడ్డారు. నాలుగు దశాబ్దాలు అవుతన్నా ఇప్పటికీ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదన్నారు. నాడు భూములు ఇచ్చింది తమ ప్రాంతం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేనని..ఇప్పుడు అమ్మేసుకుంటామంటే ఎలా కుదురుతుందని కార్మికులు ప్రశ్నించారు.