Yuvagalam Padayatra Ends: నేటితో ముగియనున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర, పోలిపల్లిలో విజయోత్సవ సభ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్ర ముగియనుంది. ముగింపు సభకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహించాలని నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
![Yuvagalam Padayatra Ends: నేటితో ముగియనున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర, పోలిపల్లిలో విజయోత్సవ సభ Nara Lokesh Yuvagalam Padayatra End Today 3,132 Kilometers Completed Yuvagalam Padayatra Ends: నేటితో ముగియనున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర, పోలిపల్లిలో విజయోత్సవ సభ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/20/c5584da28318953707bd6a826ff57b481700456612308798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nara Lokesh Padayatra Yuvagalam End Today : పాదయాత్ర ప్రారంభం నుంచి ముగిసే వరకు...ఒక స్టూడెంట్ లా వ్యవహరించారు. పొలాల్లోకి వెళ్లారు..మహిళలతో మమేకం అయ్యారు. రైతులతో ముచ్చటించారు. కూలీల కష్టాలు తెలుసుకున్నారు. నిరుద్యోగుల బాధలను చలించారు. అణుగారిన వర్గాల ఆక్రందనను ఆలకించారు. అన్ని వర్గాల ప్రజలకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఏ జిల్లాలో ఏ యే కష్టాలు ఉన్నాయి ? ప్రజల బాధలు ఏంటి ? ఎక్కడెక్కడ ఏం చేస్తే బాగుంటుందో అన్ని అవగాహన చేసుకున్నారు. పాదయాత్రతో ప్రజలతో మమేకమై...పక్కా పొలిటిషియన్ లా మారిపోయారు నారా లోకేశ్.
తెలుగుదేశం పార్టీ ( Telugudesam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh) పాదయాత్ర (Padayatra) యువగళం(Yuvagalam)ముగియనుంది. ముగింపు సభకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహించాలని నేతలు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 11 నెలల పాటు సాగిన యువగళం పాదయాత్ర నేడు విశాఖ జిల్లా (Visakhapatnam ) అగనంపూడి వద్ద ముగియనుంది. పాదయాత్ర ముగిసే సమయానికి లోకేశ్ మొత్తం 3 వేల 132 కిలోమీటర్లు కంప్లీట్ చేయనున్నారు. ప్రజలతో మమేకమై, వారి కష్టాల తెలుసుకుని, కన్నీళ్లు తుడుచేలా పాదయాత్ర చేశారు.
జనవరి 27న ప్రజాక్షేత్రంలోకి వచ్చారు నారాలోకేష్. చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారభించారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2 వేల 28 గ్రామాల మీదుగా 226 రోజుల పాదయాత్ర చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు లోకేశ్ కూడా అదే ప్రాంతంలో పాదయాత్ర ముగిస్తున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద తెలుగుదేశం విజయోత్సవ సభను నిర్వహించనుంది.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని రాజకీయాల్లో ప్రవేశించారు లోకేశ్. తొలి రోజుల్లో పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమానికి సంబంధించిన వ్యవహారాలకు సమయం వెచ్చించారు. కార్యకర్తలకు బీమా వంటి కొత్త విధానాల రూపకల్పనలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలని కలిసినప్పటికీ ఇంతగా మమేకమయ్యే అవకాశం ఆయనకు గతంలో ఎప్పుడూ రాలేదు. రాయలసీమలో పాదయాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించారు. ప్రారంభం నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల అడుగడుగునా...లోకేశ్ తో పాదం కలిపారు. మేము సైతం అంటూ కిలోమీటర్లు నడిచారు. వైసీపీ పాలనలోని ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీశారు. సమస్యలు తీర్చాలంటూ వచ్చిన ప్రతి ఒక్కరికీ నేనున్నాను అంటూ భరోసా కల్పించారు. ఆటుపోట్లన్నింటినీ దాటుకుంటూ రాబోయే మార్పునకు సంకేతమిచ్చారు.
నందమూరి తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప విరామం లేకుండా లోకేశ్ పాదయాత్ర కొనసాగించారు. మండుటెండలు, జోరువానలు, వణికించే చలిలోనూ నడిచారు. ఒక నాయకుడిగా తన నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకునే అవకాశం లోకేశ్‌కు కలిగింది. రోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలిశారు. వారు చెప్పిదంతా సావధానంగా విన్నారు. గుంతల రోడ్లు, కరవుతో బీళ్లుబారిన పొలాలు, భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు, రైతన్న దైన్యం, కూలీల ఆవేదన, ఉపాధి లేక తల్లడిల్లుతున్న యువత...ఇలా అన్ని వర్గాలతో మమేకం అయ్యారు. యువగళం పాదయాత్ర ఈ నెల 11న 3వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తేటగుంటలో...కుటుంబసభ్యులతో కలిసి పైలాన్ ఆవిష్కరించారు.
తొలుత జీవో నెం.1ని చూపించి వైసీపీ ప్రభుత్వం పాదయాత్రకు అవరోధాలు సృష్టించింది. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం వరకు పోలీసులు మొత్తం 25 కేసులు నమోదు చేశారు. ఇందులో మూడు లోకేశ్‌పై పెట్టారు. ప్రచార రథం, సౌండ్‌సిస్టమ్, మైక్, స్టూల్ సహా అన్నింటినీ సీజ్ చేశారు. పీలేరులో బాణసంచా కాల్చారని అక్కడి ఇంఛార్జి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సహా పలువురిపై మూడు కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 40 మంది యువగళం వాలంటీర్లపై కేసులు పెట్టి జైలుకు పంపారు. అయినా వెనుకడుగేయని లోకేశ్ పాదయాత్ర కొనసాగించారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. వారి పిల్లల చదువుకు భరోసా ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)