Nara Lokesh: యువత పవర్ అదిరింది, తాడేపల్లిలో టీవీలు పగులుతున్నాయ్ - విశాఖలో నారా లోకేష్
Nara Lokesh in Visakhapatnam: అధికార పార్టీ నేతలపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. జగన్ భస్మాసురుడన్న విషయాన్ని మర్చిపోతున్నాడన్నారు.
Nara Lokesh Speech: అధికార పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. శంఖారావం సభల్లో భాగంగా ఆదివారం ఉదయం తూర్పు నియోకజవర్గం పరిధిలోని అప్పుఘర్‌లో నిర్వహించిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర యువత పవర్ అదిరిందని, ఈ ప్రాంత ప్రజల పవర్‌కు తాడేపల్లిలో టీవీలు పగులుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్‌గా చంద్రబాబు చేస్తే.. గంజాయి క్యాపిటల్‌గా జగన్ రెడ్డి చేశారని లోకేష్ ఆరోపించారు. గంజాయి ఎమ్మెల్సీ అనంత్‌బాబు ప్రోత్సహించి సరఫరా చేస్తున్నాడని లోకేష్ విమర్శించారు. జగన్ లక్ష కోట్లను లూటీ చేసి పేపర్, టీవీ, భారతి సిమెంట్స్ పెట్టారని, ప్యాలెస్‌లు కట్టుకున్నాడన్నారు.
రెండు నెలల్లో ఆస్తులను జప్తు చేసి వాటిని ప్రజలకు అందిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్‌ను చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తుకు వస్తాడని, అందుకే యాత్ర-2 సినిమా తీశాడని, మొదటి షో చూసేందుకు కూడా ఎవరూ లేరన్నాడు. ఈ మధ్య కాలంలో సభల్లో అర్జునుడు, అభిమన్యుడిని అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని, జగన్ భస్మాసురుడన్న విషయాన్ని మర్చిపోతున్నాడన్నారు. ప్రతి సమావేశంలోనూ అబద్ధాలు ఆడుతున్నాడని, జగన్ కంటే పెత్తందారుడు ఎవరూ లేరని విమర్శించారు. లక్ష రూపాయలు చెప్పులు వేసుకునే వ్యక్తి, వేయి రూపాయలు విలువజేసే నీళ్లు తాగే వ్యక్తి పేదోడా, పెత్తందారుడా..? మీరే నిర్ణయించాలన్నారు. జగన్ అహంకారానికి, పేదల ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న యుద్ధమే వచ్చే ఎన్నికలు అని లోకేష్ స్పష్టం చేశారు.
ప్రజలను బాదేస్తున్న జగన్ సర్కారు
పన్నులు, చార్జీలు పెంపుతో ప్రజలను జగన్ బాదేస్తున్నాడని విమర్శించారు. చెత్త పన్ను, కరెంట్ చార్జీలు, గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచేశాడని విమర్శించారు. కటింగ్ మాస్టర్ అనేక పథకాలను కట్ చేసి నిరుపేదలను ఇబ్బందులకు గురి చేశాడని లోకేష్ ఆరోపించారు. ఇప్పటి వరకు వంద సంక్షేమ పథకాలను కట్ చేసిన ఏకైనా సీఎం జగన్ అంటూ విమర్శించిన లోకేష్.. భవిష్యత్‌లో ఈ పార్టీని సముద్రంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీ.. అభివృద్ధి, సంక్షేమ అజెండాతో అధికారంలోకి వచ్చిన తరువాత పాలన సాగిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. ప్రజలకు సూపర్ సిక్స్‌తో మరింత సంక్షేమాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలదని ఆయన వెల్లడించారు. నిరుద్యోగులకు 20 లక్షలు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఏటా డీఎస్సీ తీస్తామని, ఐదేళ్లలో ప్రభుత్వశాఖల్లో ఖాళీలను భర్తీ చేయడంతోపాటు నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని నారా లోకేష్ ఈ సభా వేదికగా హామీ ఇచ్చారు.
తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేసుకోండన్న లోకేష్
తప్పు చేసి ఉంటే తనను అరెస్ట్ చేసుకోవాలని లోకేస్ స్పష్టం చేశారు. బాంబులకు భయపడని కుటుంబం తమదని, అరెస్టులకు భయపడే పరిస్థితి లేదన్నారు. పరదాల మాటున తిరిగే వ్యక్తి ఈ సీఎం అని స్పష్టం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కార్యకర్తలకు అండగా ఉంటానని లోకేష్ హామీ ఇచ్చారు. విశాఖలో అవినీతికి పాల్పడిన నేతలను వదిలేది లేదని స్పష్టం చేశారు. ఆక్రమించుకున్న భూములను ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశాఉ. రెడ్‌బుక్‌లో ఉన్న నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న లోకేష్.. తూర్పులో టాప్-3లో మెజార్టీ వచ్చేలా చూడాలని లోకేష్ పిలుపునిచ్చారు. జోహార్ అన్న ఎన్‌టీఆర్, చంద్రబాబు నాయకత్వం, పవనన్న నాయకత్వం వర్ధిల్లాలి, జై బాలయ్య అంటూ నినాదాలు చేసిన లోకేష్ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. పార్టీలో ఏ పదవి ఉన్నా.. క్లస్టర్ యూనిట్ బూత్‌కు కనెక్ట్ కావాలని, బాగా పని చేసే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తానని లోకేష్ ఈ సందర్భంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.