TDP: కార్యకర్తల కుటుంబాలకు సాయం చేయడంలో స్టైల్ మార్చిన భువనేశ్వరి
Nara Bhuvaneshwari Nijam Gelavali: చంద్రబాబు అరెస్ట్ కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నిజం గెలవాలి పేరుతో పరామర్శిస్తున్న భువనేశ్వరి సాయం అందించే స్టైల్ మార్చారు.
Nara Bhuvaneshwari reached Araku as part of Nijam Gelavali: అరకు: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నిజం గెలవాలి (Nijam Gelavali) పేరుతో నారా భువనేశ్శరి పరామర్శిస్తున్నారు. ఇప్పటివరకూ 8 టూర్లలో కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి చెక్కులు ఇచ్చి ఆర్థిక సహాయం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తల కుటుంబాలకు సాయం చేయడంలో భువనేశ్వరి (Nara Bhuvaneswari) స్టైల్ మార్చారు. 9వ టూర్ లో సాయం చేసే విధానాన్ని మార్చేశారని టీడీపీ నేతలు తెలిపారు. పరామర్శకు వెళ్లకముందే కార్యకర్తల కుటుంబాల అకౌంట్స్ లోకి సాయాన్ని జమ చేయనున్నారు. దాంతో కార్యకర్తల కుటుంబాలు చెక్కులను బ్యాంకు లకు తీసుకెళ్లే పని లేకుండా సాయం అందిస్తున్నారు.
ఇప్పటివరకూ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భువనేశ్వరి చెక్కులు అందజేశారు. ఇకనుంచి పరామర్శకు వెళ్లేముందు బాధిత కార్యకర్తల కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో ఆర్థిక సాయాన్ని జమ చేయాలని నిర్ణయించారు. దాంతో చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేసే పని లేకుండా.. నేరుగా బ్యాంకు కు వెళ్లి డబ్బులు తెచ్చుకునేలా విధానాన్ని సరళతరం చేశారు. కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, ఆర్ధిక సాయాన్ని అందించిన విషయాన్ని తెలిపే లెటర్ ను మాత్రం ఇవ్వనున్నారు. భువనేశ్వరి ఇచ్చే లెటర్ లో కార్యకర్తల పట్ల పార్టీ, పార్టీ అధినేత, కుటుంబ సభ్యుల నిబద్దతను తెలిపేలా వివరాలను పొందుపరిచారు.
అరకు చేరుకున్న నారా భువనేశ్వరి
కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్న నారా భువనేశ్వరి అల్లూరి జిల్లాలోని అరకు చేరుకున్నారు. టీడీపీ నేతలు భువనేశ్వరికి స్వాగతం పలికారు. బుధవారం అరకు మండలం ముసిరిగూడలో 'నిజం గెలవాలి' యాత్ర కొనసాగించనున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపంతో చనిపోయినవారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శిస్తూ వెళ్తున్నారు. ముసిరిగూడలో బసు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఫిబ్రవరి 29న నర్సీపట్నం, చోడవరం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో పర్యటించి రాత్రికి అనకాపల్లి చేరుకోనున్నారు. మార్చి 1న అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. అంతకుముందు ఆ కుటుంబసభ్యుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమచేయనున్నారు.
ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి పర్యటనకు వెళుతూ మార్గమధ్యంలో సాలూరు పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నేటికీ వైద్యం అందక గిరిజనులు పడుతున్న ఇబ్బందులను మనం చూస్తున్నాం.. ఇటువంటి సమయంలో గిరిజన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు ఉన్న సాలూరు ప్రాంతంలో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ ను అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందన్నారు నారా భువనేశ్వరి. సాలూరు ప్రజలు ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ ను సద్వినియోగం చేసుకుని, వైద్య సేవలు పొందాలని కోరారు.
'సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు' అని నాన్న దివంగత ఎన్టీఆర్ నమ్మారని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 27 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలుగు ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నాం.. విపత్తులలో తెలుగు ప్రజలకు అండగా నిలుస్తున్నామని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.