Gudivada Amarnadh : ఎన్నికల కోడ్ ఉన్నందువల్లే పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వలేదు - మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్న గుడివాడ అమర్నాథ్ !
ఎన్నికల కోడ్ వల్లే పరిశ్రమకు ప్రోత్సాహకాలు విడుదల చేయలేకపోయామని మంత్రి అమర్నాథ్ ప్రకటించారు.
Gudivada Amarnadh : ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఓ పత్రికలో వచ్చిన కథనాలపై పరిశ్రమ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. రూ.720 కోట్లు ప్రోత్సాహకాలు విడుదల చేస్తామని చెప్పారు కానీ చేయలేదని ఆరోపిస్తున్నారని.. అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఆ కోడ్ తొలగిపోయిన తర్వాత ఆ నగదు విడుదల చేయాలని మాకు ఆదేశాలు వచ్చాయని ఆయన తెలిపారు. కానీ సదరు పత్రిక వార్త రాసిన ఉద్దేశం పరిశ్రమల మీద ప్రేమ కాదు.. ప్రభుత్వంపై నింద వేయడమని ఆయన ఆరోపించారు. గడిచిన మూడేళ్ళుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటిస్థానంలో నిలిచిన నేపథ్యంలో మన రాష్ట్రంలో పరిశ్రమలు ప్రారంభించాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు భావిస్తున్నాని.. ఇవి చూసి తట్టుకోలేక ఇలాంటి కథనాలు రాస్తున్నారని మంత్రి ఆరోపించారు.
గత ప్రభుత్వం రూ.360 కోట్ల పారిశ్రామిక రాయితీలు బకాయి పెడితే మేము రూ.3600 కోట్లు వివిధ రూపాలలో ప్రోత్సాహకాలను పరిశ్రమలకు అందజేశామన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కాకూడదనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు బురద జల్లుతాం అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు వస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక ఏదో రకంగా బురద జల్లుతున్నారు...ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడాన్ని రామోజీరావు తట్టుకోలేకపోతున్నారన్నారు.
మన రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తే ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరని గుడివాడ అమర్నాత్ హెచ్చరించారు. ఏ రాష్ట్రానికైన ఉండే సహజ వనరులు ఆ రాష్ట్రానికి అతి పెద్ద అసెట్. మన రాష్ట్రానికి దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరం ఉందని గుర్తు చేశారు. పరిశ్రమల కోసం 26 వేల నుంచి 30 వేల ఎకరాల భూములు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నుంచి అందే సహకారాన్ని రేపు జరిగే సదస్సులో పారిశ్రామిక వేత్తలకు వివరిస్తామని..పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి మన రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు రానున్నాయని అమర్నాథ్ తెలిపారు.
ఏ పరిశ్రమకైనా లాభ, నష్టాలు ఉంటాయని అదానీ కంపెనీ పెట్టుబడుల గురించి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. మీడియాకు పాసులు ఇస్తామని చెప్పారు. ఏపీలో విద్యుత్ కొరత లేదని స్పష్టం చేశారు. గత ఏడాది పవర్ హాలీడే ప్రకటించిన విషయం నిజమే కానీ.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల పవర్ హాలిడే వచ్చింది. కానీ ఇకపై అలా జరిగే అవకాశం లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. విప్రోను విశాఖపట్నంలో సేవలు ప్రారంభించమని కోరాం. వారు దీనిపై మార్చి, ఏప్రిల్ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇన్ఫోసిస్ మరో మూడు నెలల్లో వస్తుందని తెలిపారు.