KGH Baby Kidnap: కేజీహెచ్‌లో కిడ్నాప్ అయిన చిన్నారి సేఫ్, నిందితుల అరెస్టు - ఎలా దొరికారంటే
Visakhapatnam: శ్రీకాకుళంలోని కోటబొమ్మాళీ మండలం జర్జంగి వద్ద నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఆ పసికందును రక్షించిన పోలీసులు విశాఖపట్నానికి తీసుకు వచ్చారు.
Vizag Baby Kidnap: విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో పసికందు కిడ్నాప్‌కు (KGH Baby Kidnap) గురైన ఘటనలో చిన్నారి ఆచూకీ తెలిసింది. ఆ శిశువు సురక్షితంగానే ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో చిన్నారి ఆచూకీ కనుగొన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. శ్రీకాకుళంలోని కోటబొమ్మాళీ మండలం జర్జంగి వద్ద నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఆ పసికందును రక్షించిన పోలీసులు విశాఖపట్నానికి తీసుకు వచ్చారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.
కోటబొమ్మాళి మండలం జర్జంగి వద్ద కారు నెంబర్ ఏపీ 39 టీసీ 0726 లో చిన్నారిని తరలించారు. ఆ కారులో కవిటి మండలం వరక గ్రామానికి చెందిన మాదిన రాజేష్ కుమార్ S/o మోహన రావు, మాదిన లక్ష్మి ప్రసన్న, మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కవిటి మండలం వరక గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కోటబొమ్మాళి ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్, హైవే సిబ్బంది కలిసి టవర్ లొకేషన్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారిద్దరినీ శ్రీకాకుళం ఎస్పీ ఆఫీసుకు తరలించారు. అదుపులోకి తీసుకున్న నిందితులను, చిన్నారిని ఎస్పీ ఆఫీస్‌కు తీసుకొచ్చారు.
సీసీటీవీ కెమెరాలో అంతా రికార్డు
వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ నుండి 5 రోజుల పసికందు బుధవారం అపహరణకు గురి అయింది. విశాఖ జిల్లా పద్మనాభం మండలం రౌతుల పాలెం గ్రామానికి చెందిన అప్పాయమ్మ అనే మహిళ కాన్పు కోసం కేజీహెచ్ హాస్పిటల్ లో ఈ నెల 11 న చేరింది. అదే రోజు ఒక ఆడ శిశువుకు జన్మ ఇచ్చింది. బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో పాపను పరీక్షల కోసం తీసుకెళ్తామని ఒక మహిళ పాప అమ్మమ్మ చేతినుండి తీసుకుని వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత పాప అపహరణకు గురి అయినట్లుగా అమ్మమ్మ గుర్తించింది. కేకలు వేయడంతో హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
ఫుటేజీలో ఇద్దరు మహిళలు
హాస్పిటల్ కు చేరిన ఏసీపీ శిరీష ఇతర పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా చీర కట్టుకున్న ఒక మహిళ, చుడీదార్ వేసుకున్న మరో మహిళ పాపతో ఒక ఆటోలో గురుద్వారా వరకూ వెళ్లినట్టు గమనించారు. ఆటో డ్రైవర్ ను ట్రేస్ చేసి ప్రశ్నించగా పెద్దగా వివరాలు తెలియరాలేదని సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే దీనిపై మీడియాతో స్పందించడానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ మైథిలి గానీ, ఏసీపీ శిరీష గానీ సుముఖత చూపడం లేదు. మరోవైవు పోలీసులు పసికందు జాడ కోసం విశాఖ నగరమంతా జల్లెడ పడుతున్నారు. పాప బంధువులు కేజీహెచ్ ఆవరణలో ఆందోళనకు దిగారు.