Heavy Rains In AP: అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు, సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు
Heavy Rains In Andhra Pradesh: వరద సహాయ చర్యలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం చేశామని, సహాయక చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.
Alluri Sitaramaraju District: ఏపీలో నాలుగైదు రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తన బాధ్యతగా సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఉన్నతాధికారులతో కలిసి గత ఐదు రోజులుగా వరద ముంపు గ్రామాల్లోనే పర్యటిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శిస్తూ, వారికి సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
పూర్తిస్థాయిలో..
చింతూరు డివిజను మండలాలలో వరద సహాయ చర్యలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం చేశామని, సహాయక చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చింతూరు డివిజన్లోని వి ఆర్ పురం, కూనవరం, చింతూరు, యాటపాక మండలాల్లోని వరద ముంపుకు గురైన గ్రామాలలో సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్. గత ఐదు రోజులుగా ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ, జిల్లా యంత్రాంగానికి దిశా నిర్థేశం చేశారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ సహాయక చర్యలు..
కూనవరం, విఆర్ పురం, మండలాలలో ఎక్కువగా వరద ప్రవాహం ఉన్నందున ఆయా గ్రామాలలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటుచేసి, ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా బోట్‌లో పర్యటించి ముంపు ప్రాంతాలు పరిశీలించటంతో పాటు కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలులో స్వయంగా పాల్గొని పలువురికి ఆదర్శంగా నిలిచారు. వరద ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుగా వారిని శిబిరాలకు తరలించి వైద్య సహాయం అందించామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Also Read: Godavari Floods : వరద ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తే ఏమవుతుంది? దీని వెనుక చాలా కసరత్తు ఉంటుందని తెలుసా ?
ముంపునకు గురైన బాధితులందరికీ నిత్యవసర వస్తువులైన బియ్యం, పప్పులతో పాటు ఉల్లిపాయలు, నూనె, మంచినీటి సదుపాయం కల్పించారు. కొండపైనున్న వారికి టార్పాలిన్స్ ఏర్పాటు చేశారు. వరదలు తగ్గుముఖం పట్టేవరకు వరద బాధితులు అందరికీ సహాయక చర్యలు అందించాలని అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. చింతూరు, కూనవరం, వి ఆర్ పురం ఎటపాక మండలాలలోని గ్రామాలలో వరద సహాయ చర్యల్లో భాగంగా ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, బాధితులకు నిత్యావసర వస్తువులు ఆయా గ్రామాలకు తరలించడాన్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాలలో కలెక్టర్ వెంట చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రామశేషు, డివిజనల్ సివిల్ సప్లై అధికారి, సి శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Polavaram Floods : పోలవరం ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువకు నీరు - తొలి సారి ఆపరేట్ చేసిన అధికారులు