GVL Narasimha Rao: రాష్ట్ర విభజన సమయంలో కొన్ని కులాలకు అన్యాయం - జీవీఎల్
GVL Narasimha Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కొన్ని కులాలకు నష్టం జరిగిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అన్నారు.
GVL Narasimha Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కొన్ని కులాలకు నష్టం జరిగిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అన్నారు. గురువారం విశాఖపట్నం సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఉత్తరాంధ్ర బీసీల సామాజిక సాధికారత సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తూర్పు కాఫు, శిష్టకరణ, కళింగ వైశ్య, సొంది నాలుగు ప్రముఖ కులాలకు కేంద్ర ఓబీసీ రిజర్వేషన్ రావడం లేదన్నారు. వారంతా పదేళ్ల నుంచి కేంద్ర ఓబీసీ లో చేర్చాలని కోరుతున్నారని అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
ఉత్తరాంధ్రలో బీసీగా ఉన్నవారు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు వెళ్తే న్యాయం జరగడం లేదని జీవీఎల్ అన్నారు. ఈ అంశం మీద పార్లమెంట్‌లో మాట్లాడానని, ఎన్‌సీబీసీ చైర్మన్తో మాట్లాడానని ఈ మేరకు ఈ నెల 13న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనిపై అభిప్రాయ సేకరణ జరుగుతోందన్నారు. నాలుగు ప్రముఖ కులాలైన తూర్పు కాఫు, శిష్టకరణ, కళింగ వైశ్య, సొందిని ఓబీసీలో చేర్చాలనే ప్రతిపాదన కేంద్రం ముందు ఉంచినట్లు చెప్పారు.
అలాగే ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను తెలంగాణ రాష్ట్రం బీసీ జాబితా నుంచి తొలగించారని జీవీఎల్ ఆరోపించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందన్నారు. రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధే కావచ్చని, కానీ బీసీలకు నష్టం జరగకూడదన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ విషయం రాజ్యాంగ సవరణ 338(బీ) లో స్పష్టంగా చెప్పబడిందన్నారు.
రాష్ట్ర విభజన జరిగిన తరవాత ఎందుకు కొన్ని కులాలకు నష్టం చేశారని ఆయన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించారు. బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తూర్పు కాఫు, శిష్టకరణ, కళింగ వైశ్య, సొందిలకు కేంద్రం ఓబీసీలో చేర్చడంతో పాటు, తెలంగాణలో తొలగించిన 26 బీసీ కులాలను తిరిగి చేర్చాలని, ఉత్తరాంధ్ర బీసీ సంఘాలకు న్యాయం జరగాలని తీర్మానం చేశారు.