Divvela Madhuri Car Accident: దువ్వాడ ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్, టోల్‌గేట్ వద్ద మాధురి కారు బోల్తా
Duvvada Srinivas Family Disputes | వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తన భర్తపై, దివ్వెల మాధురిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో దివ్వెల మాధురి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.
![Divvela Madhuri Car Accident: దువ్వాడ ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్, టోల్‌గేట్ వద్ద మాధురి కారు బోల్తా Duvvada Srinivas Family Issue Update Divvela Madhuri car met with accident in Palasa Divvela Madhuri Car Accident: దువ్వాడ ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్, టోల్‌గేట్ వద్ద మాధురి కారు బోల్తా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/11/454cd5145d2765be62366e45494a85171723373444183233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Duvvada Srinivas Family Issue : పలాస: గత మూడు రోజులుగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధించి ఆయన భార్య దువ్వాడ వాణి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం దువ్వాడ శ్రీను స్నేహితురాలు, వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురి కారు బోల్తా పడింది. ఆమె అతి వేగంతో కారును నడిపి, మరో వాహనాన్ని ఢీకొట్టడంతో మాధురి కారు బోల్తా పడినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో మాధురి కారు రోడ్డు ప్రమాదం ఘటన హాట్ టాపిక్ గా మారింది. దివ్వెల మాధురికి స్వల్ప గాయాలు కాగా, సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లక్ష్మీపురం టోల్‌గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం
పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన మాధురి కారు, ఆగి ఉన్న మరో కారును ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో దివ్వెల మాధురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల సాయంతో మాధురిని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. దువ్వాడ వాణి తన భర్త ఇంటికి రాగా, ఆయన ఆమెను కలవాడానికి ఆసక్తి చూపలేదు. అంతకుముందు రోజు వాణి ఇద్దరు కుమార్తెలు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దకు రాగా, గేట్లు కూడా తెరవలేదు. కొన్ని గంటలపాటు తన తండ్రిని కలుసుకునేందుకు వేచి చూసినా ఫలితం లేకపోయింది. దాంతో వారు చేసేదేమీ లేక రాత్రి వరకు ఎదురుచూసి తిరిగి వెళ్లిపోయారు. మరుసటి రోజు నుంచి తల్లి దువ్వాడ వాణితో కలిసి కుమార్తెలు హైందవి, మరో కుమార్తె దువ్వాడ శ్రీను ఇంటి వద్ద నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఓపిక నశించి, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం సైతం చేశారు.
అనంతరం దువ్వాడ వాణి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ తనకు, తన కూతుళ్లకు అన్యాయం చేశారని ఆరోపించారు. గత కొంతకాల నుంచి దువ్వాడ పూర్తిగా మారిపోయారని, దివ్వెల మాధురి అనే మహిళతో సంబంధం పెట్టుకున్నారని అందుకే తమను పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ నుంచి సైతం తనకు ఏ సహాయం అందడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ స్పందించి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తనకు న్యాయం చేయాలని కోరారు.
భార్యను, పిల్లల్ని దూరం పెట్టి తన ఇష్టానుసారంగా వేరే మహిళతో ఉంటున్న తన భర్త, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ అధినేత జగన్ చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ కోసం తాను ఎంతో చేశానని, కానీ ఈరోజు ఏ విధంగానూ మద్దతు దొరకడం లేదని దువ్వాడ వాణి ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తులను దువ్వాడ శ్రీను ఆయన కుటుంబసభ్యులు తీసుకున్నారని, కనీసం తమకు చెందాల్సిన ఆస్తులను దక్కించుకుంటామన్నారు. తన అత్త లీలావతి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దివ్వెల మాధురి తన భర్తతో కలిసి అసాంఘిక కార్యకలాపాలు చేస్తోందని.. ఇది ఎవరూ హర్హించరన్నారు. ఓ మహిళగా న్యాయపరంగా పోరాటం చేసి తన హక్కులను సాధించుకుంటానన్నారు. తమ కుటుంబంలో చిచ్చుపెట్టిన మహిళను వదిలే ప్రసక్తే లేదంటూ మాధురికి సైతం దువ్వాడ వాణి వార్నింగ్ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)