TDP Meeting: ఈ నెల 5, 6 తేదీలలో 3 చోట్ల చంద్రబాబు రా కదలిరా సభలు, ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ
Ra Kadali Ra Meeting: టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 5న అనకాపల్లి జిల్లాకు రానున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పర్యటిస్తున్నారు. రా కదలిరా పేరుతో సభను నిర్వహిస్తున్నారు
Chandrababu Ra Kadali Ra Meeting In Madugula: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఐదో తేదీన అనకాపల్లి జిల్లాకు రానున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జోరుగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సభలను నిర్వహిస్తున్నారు. రా కదలిరా పేరుతో నిర్వహిస్తున్న సభల్లో భాగంగా కార్యకర్తలు, ప్రజలనుద్ధేశించి చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఆయన కేడర్‌ను సంసిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సభలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో తొలి ఎన్నికల సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల ఐదో తేదీన అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో సభను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు రెండు లక్షల మందితో సభను నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు రానున్న చంద్రబాబు ముందుగా విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి మాడుగులకు వెళ్లనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనల వివరాలు
- ఫిబ్రవరి 5, 6 తేదీల్లో మూడు చోట్ల రా కదలి రా సభల్లో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు
- 5వ తేదీ అనకాపల్లి పార్లమెంట్ మాడుగుల, ఏలూరు పార్లమెంట్ చింతలపూడిలలో రా కదలి రా సభలు
- 6వ తేదీన చిత్తూరు పార్లమెంట్ లోని జి.డి. నెల్లూరులో రా కదలి రా సభలో పాల్గొననున్న టీడీపీ అధినేత
•ఇప్పటి వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రా కదలి రా సభల నిర్వహణ
సభ బాధ్యతలు ఆ నేతలకు
చంద్రబాబు పాల్గొంటున్న రా కదలిరా సభను విజయవంతం చేయడంపై ఉమ్మడి విశాఖ జిల్లా ముఖ్య నేతలు దృష్టి సారించారు. భారీగా జనాలను సమీకరించడం ద్వారా సభను విజయవంతం చేసి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. సభ నిర్వహణ బాధ్యతలను పార్టీ అధిష్టానం విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తదితర నేతలకు అప్పగించింది. వీరంతా సభ నిర్వహించనున్న మాడుగులకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడే పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. సభకు కార్యకర్తలు, ముఖ్య నాయకులు భారీగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారంతా నేతలకు సూచించారు.
రెండు రోజులు నుంచి స్థానిక నేతలు కూడా సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, కేఎస్‌ఎన్ రాజు, గవిరెడ్డి రామానాయుడు, కూన రవి కుమార్, పీవీజీ కుమార్, ప్రగడ నాగేశ్వరరావు, బత్తుల తాతయ్య తదదితరులు సభకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేలా
ఈ నెల ఐదో తేదీన నిర్వహించనున్న రా కదలి రా సభను విజయవంతం చేయడం ద్వారా కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. కొద్దిరోజులు కిందట ఏజెన్సీ పరిధిలోని అరకులో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో గిరిజన ప్రాంతాల్లోని నేతలు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక్కడి సభ విజయవంతం అయితే ఈ జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో సులభంగా విజయం సాధించేందుకు అవకాశముంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం భారీగా జనాలను సమీకరించే దిశగా పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు.
ఇప్పటికే నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నాయి. సభకు రెండు రోజులే సమయం ఉండడంతో కీలక నేతలు ఇక్కడి జిల్లా నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. మండలాలు, గ్రామాలు వారీగా ఉన్న ముఖ్య నాయకులను పిలిపించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం సభ విజయవంతం కాకుండా ఒత్తిళ్లు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలని పలువురు నాయకులు కేడర్‌కు సూచించారు.