బొబ్బిలి వీణను చూసి మురిసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, కానీ నేటి పరిస్థితి భిన్నంగా !
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో బొబ్బిలి వీణను చూసి మురిసి, తయారీదారుల సంఘం అధ్యక్షుడు సర్వ సిద్ధి వెంకటరమణను వైట్ హౌస్‌కు ఆహ్వానించటం మరో విశేషం.
వీణ పేరు చెప్పగానే బొబ్బిలి గుర్తొస్తుంది. అక్కడి కళాకారులకూ అంతే గుర్తింపు. అయితే, ఇప్పటికే ముడిసరకు దొరకక ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తయారీదారులకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు కరోనా వచ్చి పడింది. లాక్ డౌన్ లో అమ్మకాలు తగ్గి నిల్వలు పేరుకుపోయాయి. పరిస్థితులు మెరుగుపడినా కోలుకునేందుకు సమయం పడుతుందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రభావంతో వీణల తయారీ కళాకారులకు పని లేక ఉపాధి కరువైంది. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చేవి. హస్తకళల అభివృద్ధి సంస్థ వీణలను కొనుగోలు చేసి లేపాక్షి దుకాణాల్లో విక్రయాలు చేపట్టేది. ఇప్పుడివి తెరచుకోకపోవడంతో తయారైన నిల్వలు ఇక్కడే ఉండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని కళాకారులు చెబుతున్నారు.
సుమధుర రాగాలను పలికించే వీణల తయారీకి విజయనగరం జిల్లా బొబ్బిలి పెట్టింది పేరు. ఇక్కడి వీణలంటే సంగీత విద్యాంసులకు, సంగీత ప్రియులకు ఎంతో గౌరవం. ఎందుకంటే శ్రుతి తప్పకుండా సాగిపోయే రాగాలతో.. అలల్లా సాగిపోయే వీనుల విందైన సంగీతాన్ని పలికిస్తాయి. కళలకు, యుద్ద విన్యాసాలకు, చారిత్రక ఆనవాళ్లకు నిలయమైన బొబ్బిలో వందల ఏళ్లక్రితం ఏర్పాటైన వీణల తయారీ కేంద్రం ఇప్పటికీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. దేశ, విదేశాలనుంచి వచ్చే అతిధులకు, ప్రముఖులకు ఈ వీణలే ప్రస్తుతం జ్ఞాపికలుగా అందించి గౌరవించుకునే స్థాయిలో ఈ వీణలు ఉన్నాయంటే బొబ్బిలి వీణకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం అవుతోంది. జియోగ్రాఫికల్ గుర్తింపు లభించిన బొబ్బిలి వీణకున్న పేరు, ప్రఖ్యాతి మరే వీణలకు లేదనే చెప్తారు. ఇక్కడ తయారైన వీణలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్, తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు వీణలు 3 చెక్కలతో తయారు చేస్తే.. బొబ్బిలి వడ్రంగులు ఒకే చెక్కతో వీణలు తయారు చేయడంలో సిద్ధహస్తులు. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లి గ్రామం వీణలకు పుట్టినిల్లు. గత 300 సంవత్సరాలుగా ఇక్కడ వీణలు తయారు చేస్తున్నారు.
ముడిసరుకు దొరకక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. వీణల తయారీకి వినియోగించే పనస కలప అటవీ ప్రాంతం నుంచి తీసుకురావాలి. రవాణా లేక కలప కొరత వచ్చింది. తయారీకి వినియోగించే మైనం, పాలిష్(మెరుగు), తీగలు, లక్క ముంబయి నుంచి రావడం లేదు. నెమలి, ప్లెయిన్ వీణలు డిమాండు ఎక్కువ. మృదంగం, తంబుర, డోలు సన్నాయి, వీడియో లిన్, సొరమండలి అమ్ముడవుతుంటాయి. చిన్నవి 740 నుంచి 1500 రూపాయల వరకు, పెద్ద వీణలు 20 వేల పైనే ధరలు ఉన్నాయి. తయారీ ఖర్చులు మినహా కళాకారులకు చిన్న సైజు వీణకు 200 రూపాయల వరకు మిగులుతుంది. ఈ పరిశ్రమపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 200 కుటుంబాల జీవనోపాధి ఇప్పుడు ప్రశ్నార్థకమైంది..
వీణల తయారీనే వృత్తిగా భావించిన కార్మికులను ప్రభుత్వం గుర్తిస్తే, డిమాండ్ కు తగ్గట్టుగా వీణలు తయారు చేయగలుగుతారు. మరికొంత మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని బొబ్బిలి వీణ తయారి కళాకారులు కోరుతున్నారు. సప్తస్వరాలను పలికించే సంగీత సాధనం వీణ. మనసు పులకింపచేసే రాగాలను, నాదాలను అలవోకగా పలికించేది వీణ. సంగీత విద్వాంసులకు, సాధకులకు తమ చేతిలో వీణ ఉంటే..., రాగాలు అలల్లా సాగిపోతాయి. వినసొంపైన సంగీతం వీణులవిందును అందిస్తుంది. అలాంటి రాగాలు సంగీత ప్రవాహనికి విజయనగరం జిల్లా బొబ్బిలి వీణ ప్రసిద్ది గాంచింది. భౌగోళికంగా ప్రపంచ గుర్తింపు పొందిన బొబ్బిలి వీణకు ఉన్న పేరు, ప్రఖ్యాతి మరే వీణలకు లేదనే సంగీత కళాకారులు చెప్తారు.
కళలకు, యుద్ద విన్యాసాలకు, శతాబ్దాల చారిత్ర ఆనవాళ్లకు నిలయమైన బొబ్బిలో మూడు శతాబ్దాల ఏళ్లక్రితం ఏర్పాటైన వీణల తయారీ ఇక్కడ ఇప్పటికీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. దేశ, విదేశాల నుంచి వచ్చే అతిధులకు, ప్రముఖులకు జ్ఞాపికలుగా అందించి గౌరవించుకునే స్థాయిలో ఈ వీణలు ఉన్నాయంటే.., బొబ్బిలి వీణకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం అవుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో బొబ్బిలి వీణను చూసి మురిసి, తయారీదారుల సంఘం అధ్యక్షుడు సర్వ సిద్ధి వెంకటరమణను వైట్ హౌస్‌కు ఆహ్వానించటం మరో విశేషం.
దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల వింతలు, విశేషాలు, ప్రముఖ వ్యక్తుల పేరుల మీద, చారిత్రక అంశాలపైనా పోస్టల్ శాఖ తపాల కవర్లు ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే బొబ్బిలి వీణ పేరిట పోస్టల్ కవర్ ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు బొబ్బిలి చరిత్రపైనా పోస్టల్ శాఖ దృష్టి సారించినట్లు అధికారుల చెబుతున్నారు. ఇందులో భాగంగా బొబ్బిలి చారిత్రాత్మక కట్టడాలు, బొబ్బలి యుద్దం, తాండ్ర పాపారాయుడు నేపథ్యం, వేణుగోపాల స్వామి చరిత్ర పేరిట పోస్టల్ కవర్ల ముద్రణకు ఆ శాఖ వివరాలు సేకరిస్తోంది. బొబ్బిలి వీణపై పోస్టు కవర్ విడుదలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.