Virat Kohli in Visakhapatnam: విశాఖలో విరాట్ కోహ్లీ కోసం ఎదురు చూస్తున్న 3 అతిపెద్ద రికార్డులు, మూడో ODIతో శతకాల బాద్‌షా కావచ్చు!
Virat Kohli Records: భారత్-దక్షిణాఫ్రికా మూడో వన్డే విశాఖపట్నంలో జరగనుంది. ఇప్పటికే మంచి ట్రాక్ రికార్డు ఉన్న కోహ్లీ కోసం మూడు రికార్డులు ఎదురు చూస్తున్నాయి.

Virat Kohli Records: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మూడో, నిర్ణయాత్మక వన్డే మ్యాచ్ డిసెంబర్ 6 శనివారం నాడు విశాఖపట్నంలో జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమానంగా ఉంది. మూడో మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధిస్తూ 118.50 సగటుతో 237 పరుగులు చేశాడు. ఇప్పటివరకు అతను సిరీస్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. మూడో వన్డేలో విరాట్ కోహ్లీ తన పేరు మీద సాధించగలిగే 3 రికార్డులు ఉన్నాయి. వాటిని కూడా బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అందుకే ఆయన కోసం భారీ స్థాయిలో టికెట్లు సేల్ అయ్యాయి.
వన్డే సెంచరీల హ్యాట్రిక్
వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 12 మంది క్రికెటర్లు వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు, అంటే వన్డే సెంచరీల హ్యాట్రిక్ సాధించారు. బాబర్ ఆజం ప్రపంచంలోనే ఒకే ఒక్క బ్యాట్స్‌మన్, అతను ఈ ఘనతను 2 సార్లు సాధించాడు. భారతదేశం తరపున విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటివరకు ఒక్కొక్కసారి వన్డే సెంచరీల హ్యాట్రిక్ పూర్తి చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగే మూడో వన్డే మ్యాచ్‌లో కూడా విరాట్ సెంచరీ సాధిస్తే, వన్డేలలో సెంచరీల హ్యాట్రిక్ 2 సార్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్ అవుతాడు.
దక్షిణాఫ్రికాపై వరుసగా 4 సెంచరీలు
విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికాపై వన్డే మ్యాచ్‌ల్లో ఇప్పటికే సెంచరీల హ్యాట్రిక్ సాధించాడు. ప్రస్తుత సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో అతను వరుసగా 135, 102 పరుగులు చేశాడు. ఇంతకుముందు 2023 వన్డే ప్రపంచ కప్‌లో కూడా దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించాడు. ఇప్పుడు మూడో వన్డే మ్యాచ్‌లో కూడా సెంచరీ సాధిస్తే, విరాట్ వన్డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై వరుసగా 4 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ అవుతాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 555 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 27910 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో అతను మూడో స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న కుమార సంగక్కరను అధిగమించడానికి అతను 107 పరుగులు చేయాలి. సంగక్కర 28016 పరుగులు చేశాడు. విరాట్ మూడో వన్డేలో మరో 107 పరుగులు చేస్తే, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ అవుతాడు.
కోహ్లీ కోసం వస్తున్న అభిమానులు
రెండు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ ఆడిన విధానంతో విశాఖ వన్డేపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీడియా అండ్ ఆపరేషన్స్ బృందం నుంచి వై వెంకటేష్ ఇంగ్లీష్ ఛానల్స్‌తో మాట్లాడుతూ ఇలా పేర్కొన్నాడు:
"మొదటి దశ టిక్కెట్లు నవంబర్ 28న అమ్మకానికి వచ్చాయి. స్పందన అంతా లేదు. కానీ రెండో దశ టిక్కెట్లు అమ్మకానికి ఒక రోజు ముందు, కోహ్లీ రాంచీలో ఆ సెంచరీ చేశాడు. దీంతో అంతా మారిపోయింది."
"అతనికి ఇక్కడ అద్భుతమైన రికార్డు ఉందని మనందరికీ తెలుసు... కాబట్టి రెండో మూడో దశ టిక్కెట్లు ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు, అవి నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి." అని ఆయన చెప్పారు.
రాంచీలో సెంచరీ తర్వాత, విరాట్ కోహ్లీ రాయ్‌పూర్‌లో భారతదేశం- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్‌లో మరో సెంచరీ సాధించాడు.
ఆ రోజు రుతురాజ్ గైక్వాడ్ కూడా ఫార్మాట్‌లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.
దురదృష్టవశాత్తు, అవి ఫలించలేదు, ఎందుకంటే ప్రోటీస్ 359 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు చేతిలో ఉండగా విజయవంతంగా ఛేదించింది.





















