Ayyanna Patrudu Son Rajesh: పర్మిషన్ తీసుకుని నిర్మించినా, అక్రమ కేసులు బనాయించి కూల్చివేతలా ?: అయ్యన్న కుమారుడు ఫైర్
Ayyanna Patrudu Son Rajesh: మాజీ మంత్రి అయ్యన్న కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగినా, వారిని పక్కను జరిపేసి సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ టీడీపీ నేత ఇంటి గోడ కూల్చివేతను పూర్తిచేశారు.
Ayyanna Patrudu House Home Wall Demolition: ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను నర్సీపట్నం మునిసిపల్ సిబ్బంది కూల్చివేశారు. అయ్యన్న కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగినా, వారిని పక్కను జరిపేసి సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ మాజీ మంత్రి ఇంటి వెనుకవైపు గోడను కూల్చివేతను పూర్తిచేశారు. అయితే నర్సీపట్నం మున్సిపల్ సిబ్బంది తీరుపై అయ్యన్న పాత్రుడు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అన్ని అనుమతులు తీసుకున్నాకే గోడను నిర్మించామని, కానీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించి తమ ఇంటిని కూల్చివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత చేపట్టారని ఆరోపించారు.
అనుమతులు తీసుకున్నాం.. కానీ కక్షసాధింపుతో !
ల్యాండ్ పర్మిషన్ తీసుకున్న తరువాతే తాము గోడను నిర్మించామని అయ్యన్న పాత్రుడు రెండో కుమారుడు చింతకాయల రాజేష్ తెలిపారు. మున్సిపల్ సిబ్బంది తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. తాము న్యాయంగా అన్ని అనుమతులు తీసుకున్నాకే ఇల్లు కట్టుకున్నామని, కానీ కబ్జా చేశారని ఆరోపిస్తూ అక్రమ కేసులు బనాయించారని వ్యాఖ్యానించారు. పర్మిషన్ తీసుకుని నిర్మించిన తమ ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడం ఎంత వరకు కరెక్ట్ అని రాజేష్ ప్రశ్నించారు. రాత్రి నోటీసులు ఇచ్చామని చెప్పిన అధికారులు తెల్లారేసరికల్లా వచ్చి నిర్మాణం కూలగోట్టడం కక్ష సాధింపు చర్యేనన్నారు.
పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపణలు
తాము అనుమతులు తీసుకుని నిర్మించినా అక్రమంగా కేసులు బనాయించారని చెప్పిన చింతకాయల రాజేష్.. పోలీసులు తమ ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. పంట పొలాన్ని అక్రమించారని, ప్రభుత్వ భూమిలో రెండు సెంట్లు ఆక్రమించారని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తమ కుటుంబం వారిస్తున్నా వినకుండా మునిసిపల్ సిబ్బంది తమకు ఆదేశాలు వచ్చాయంటూ గోడను కూల్చివేశారని తెలిపారు. పర్మిషన్ ఉందని చెప్పినా పట్టించుకోకుండా పోలీసుల సహకారంతో మమ్మల్ని పక్కకు జరిపేసి ఇంటి గోడ కూల్చివేతను పూర్తిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Ayyanna Patrudu: నర్సీపట్నంలో హైటెన్షన్ - అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత, భారీగా పోలీసుల మోహరింపు
ఇటీవల అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన మినీ మహానాడులో సీఎం వైఎస్ జగన్‌పై, ఏపీ మంత్రులపై మాజీ మంత్రి అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిలోని 2 సెంట్లు భూమి ఆక్రమించారని, పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ అయ్యన్నకు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపై ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయి. అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో అనకాపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటీవల మంత్రి రోజాపై సైతం అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. నిన్న రాత్రి నోటీసులిచ్చిన అధికారులు నేటి ఉదయమే అరెస్ట్ చేసేందుకు అయ్యన్న ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. మీడియాను అయ్యన్న ఇంటి పరిసరాల్లోకి రానీయకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.