Ayyanna Patrudu: నీ తండ్రి పాలనలోనూ ఇంత దౌర్జన్యం లేదు, ఆడవారిపైనా ప్రతాపమా?: అయ్యన్నపాత్రుడు
అయ్యన్నకు బెయిల్ మంజూరు చేయడంతో నర్సీపట్నంలో తెలుగుదేశం కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టపాకాయలు కాల్చారు.
కోర్టుకు నకిలీ పత్రాలు సమర్పించారనే ఆరోపణలపై అరెస్టై బెయిల్ పైన విడుదలైన మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు తన అరెస్టు వ్యవహారంపై స్పందించారు. రాష్ట్రంలో న్యాయం ఇంకా బతికే ఉందని మరోసారి నిరూపితమైందని అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించడంతో అయ్యన్నపాత్రుడు గురువారం రాత్రి విడుదలయ్యారు. విశాఖ నుంచి సొంతూరు నర్సీపట్నం చేరుకునే క్రమంలో మార్గమధ్యలో అడుగడుగునా ఆయనకు అభిమానులు హారతులు పట్టారు.
అయ్యన్నకు బెయిల్ మంజూరు చేయడంతో నర్సీపట్నంలో తెలుగుదేశం కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టపాకాయలు కాల్చారు. అయ్యన్నపాత్రుడికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఫోన్ చేశారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలపై అయ్యన్న పోరాటాన్ని ప్రశంసించారు. ముందు ముందు ఇదే పంథా కొనసాగించాలని పార్టీ ఎప్పుడూ మద్దతుగానే ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తిచూపితే వాటిని రాజకీయంగా ఎదుర్కోవాలని, అంతే కానీ, వ్యక్తిగత కక్షలతో చూడకూడదని అన్నారు. ఇలా కక్షసాధింపు చర్యలకు దిగడం సమంజసం కాదని అన్నారు. తనపై అక్కసుతో తన కుటుంబ సభ్యుల్ని వేధించడం సరికాదని అన్నారు. అర్థరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి బలవంతంగా సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేశారని, అయితే, అరెస్టు తర్వాత ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని అయ్యన్న పాత్రుడు చెప్పారు.
మీ నాన్న ఉన్నప్పుడు కూడా ఇంత దౌర్జన్యం లేదు
‘‘మీ తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇంతలా దౌర్జన్యం లేదు. మేం చేసే విమర్శల్ని పాజిటివ్ గా తీసుకో. మా నోర్లు మూయించాలని చూస్తే కుదరదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం, శత్రుత్వం అనేది ఉండదు. నా మీద 14 కేసులు పెట్టావు. నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా కాబట్టి, తట్టుకుంటా. నా కుటుంబ సభ్యుల మీద, నా మనవరాలి మీద ఆడవారి మీదకు రావాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డీ.. మాది ఒకటే మాట. ఒకటే పార్టీ. నువ్వు ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నీ తప్పులు ప్రజలకు చెప్తానే ఉంటాం. భయపడే ప్రసక్తే లేదు.’’ అని అయ్యన్నపాత్రుడు అన్నారు.
200 పోలీసులు వచ్చి అరెస్టు
తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సీఐడీ అధికారులు సుమారు 200 మంది పోలీసులతో మా ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ టైంలో గేట్లు వేసి ఉన్నా, గోడలు దూకి లోపలికి వచ్చి కట్టర్స్ తో గేట్లు కట్ చేసి దౌర్జన్యంగా దూసుకొచ్చారు. అక్కడున్న అలజడి వల్ల నేను బయటికి వచ్చాను. నన్ను అరెస్టు చేస్తామని చెప్పారు. కనీసం బట్టలు వేసుకొని వస్తానని చెప్పినా ఆ సమయం కూడా ఇవ్వలేదు. బలవంతంగా తీసుకెళ్లి జీపులో తీసుకెళ్లారు. నర్సీపట్నం బయలుదేరారు. 7.30 గంటల ప్రాంతంలో సీఐడీ ఆఫీసుకు వచ్చాం. అక్కడైతే ఏ ఇబ్బంది పెట్టలేదు.
నేడు దీనిపై హైకోర్టులో చర్చ ఉంది. ఈ టైంలో ఆ విషయంపై ప్రెస్ తో మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న వారి నోళ్లు నొక్కాలని చూస్తున్నారు. నేను శత్రువుని కాదు. మీ రాజకీయ ప్రత్యర్థులం. అర్థం చేసుకోవాలి. రాత్రి నన్ను అరెస్టు చేసినప్పటి నుంచి దీనిపై రాష్ట్రంలోనే కాక, విదేశాల నుంచి నన్ను పరామర్శించేందుకు ఫోన్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు’’ అని అయ్యన్న పాత్రుడు మాట్లాడారు.