Thappeta Gullu: కష్టాల బాటలో తప్పెటగుళ్ళు, కళను రక్షించమంటున్న కళాకారులు!
Thappeta Gullu: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా కనిపించే తప్పెటగుళ్లు ఆట కష్టాల బాటలో సాగుతోంది. అంతరించిపోయే దశలో ఉన్న కళను కాపాడాలని కళాకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Thappeta Gullu: తప్పెటగుళ్లు.. నాలుగు వందల ఏళ్ల క్రితం నాటి కళారూపం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని యాదవ కులస్థులు చేసే కళారూపం ఇది. రొమ్ముపై రేకు తప్పెటలు, నడుముకు, కాళ్లకు గజ్జెలు ధరించి అంతా కలిసి ఒకే రిథమ్ లో చేసే డ్యాన్స్. పాటలు పాడుతూ వాటికి సరిపోయే స్టెప్పులు వేస్తుంటారు. తప్పెట గుళ్లు ఆట శ్రీకాకుళం జిల్లాలో చాలా ఫేమస్. పండగలు పబ్బాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర ఈవెంట్లలో తప్పెట గుళ్లు ఆట ఆడతారు.
తప్పెటగుళ్లు..
శ్రీకాకుళం జిల్లా, పరిసర ప్రాంతాల్లో తప్పెటగుళ్లు మొదలు అయినట్లు చరిత్రకారులు, కళాకారులు చెబుతుంటారు. తర్వాత్తర్వాత ఈ కళ విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలకు విస్తరించింది. యాదవులకే ప్రత్యేకమైన ఈ ఆట పుట్టుక వెనక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కాటమ రాజు భార్య గంగమ్మ, పార్వతీ దేవి శివుని ఆజ్ఞ మేరకు కాటమరాజు భార్యగా జన్మించిందనీ, ఆ గంగమ్మ యాదవ కులానికి ఆరాధ్య దేవత అని యాదవుల నమ్మకం. శివుని దర్శించిన భక్తులందరికీ అన్ని వాయిద్యాలనూ ఇవ్వగా మిగిలి పోయిన తప్పెట గుళ్ళను మాత్రం యాదవులకు ఇచ్చారని కొందరు చెబుతుంటారు.
యాదవులకు గోపాలుడే కులదైవం. ఆయన మృతి చెందినప్పుడు యాదవులంతా గుండెలు కొట్టుకుంటూ శోకించారని, అలా తప్పెట గుళ్లు మొదలు అయిందని మరికొందరు అంటారు.
యాదవ రాజు అయిన కాటమరాజుకు నెల్లూరు సిద్దిరాజుకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆలమందలను కాపాడుకోవడానికి వారంతా డప్పులు, తాళాలతో గుండెలపై కొట్టుకున్నారని అలా తప్పెట గుళ్లు ఆవిర్భవించిందని మరోకథ.
యాదవులకు పశువులూ, గొఱ్ఱెలూ, మేకల మందలూ ఎక్కువ. వర్షాలు పడక పశుగ్రాసానికి కూడా కష్టమైనప్పుడు భగవంతుని కటాక్షం కోసం చేసే దేవతారాధనే ఈ తప్పెట గుళ్లు అని అంటారు.
కళింగ కళారూపమిది
తప్పెటగుళ్ళు జానపద సంగీత నాట్య దృశ్య రూపకం. రేకుతో గుండ్రంగా తయారు చేసిన తప్పెటలాంటి ఒక వాయిద్య పరికరాన్ని రొమ్ములపై కట్టుకుని రెండు చేతులతోనూ వివిధ గతులలో వాయిస్తుంటారు. కాళ్ళకు గజ్జెలు కట్టి ఒకే విధమైన రంగుల నిక్కర్లను తొడిగి, కేకలతో రూపాలతో కేరింతలు కొడుతూ నృత్యం చేస్తుంటారు. ఉత్సాహంగా వలయాకారంగా తిరుగుతూ కట్టుదిట్తమైన శాస్త్రీయమైన అడుగులతో అందరూ వంగుతూ, లేస్తూ, గెంతుతూ, సుదీర్ఘ రాగాలతో ఆలాపన చేస్తూ తప్పెట గుళ్లు ఆడుతుంటారు.
తగ్గిపోతున్న తప్పెటగుళ్ల కళాకారులు
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తప్పెటగుళ్ల ఆటకు జనాల్లో ఆదరణ ఉన్నా.. కళాకారులు మాత్రం రోజురోజుకూ తగ్గిపోతూ వస్తున్నారు. కొత్త వారు తప్పెటగుళ్లను నేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. తప్పెటగుళ్లు ఆడే కుటుంబాల్లోనూ కొత్త తరాలు తప్పెట గుళ్లకు క్రమంగా దూరం పెడుతున్నారు. దీనిపై ఆసక్తి చూపడం లేదు. కనీసం ప్రభుత్వం అయినా సహకరిస్తే ఈ కళలను ముందుకు తీసుకువెళ్తామని కళాకారులు చెబుతున్నారు. ఎంతో మంది నాయకులు మధ్య ప్రదర్శనలు ఇచ్చామని.. ప్రశంసలు తప్పు వారి నుంచి సరైన ఆదరణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంప్రదాయ కళలను ఎలాగైనా సరే బ్రతికించుకోవాలని.. కొన్ని బృందాలుగా ఏర్పడి ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నామని చెబుతున్నారు.