Visakhapatnam CII Investors Summit: వెలిగిపోతున్న విశాఖ - దిగ్గజ పారిశ్రామికవేత్తల రాక ఆరంభం - సీఐఐ సమ్మిట్‌కు ఏర్పాట్లు పూర్తి
CII Investors Summit : విశాఖ సీఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విదేశీ పారిశ్రామికవేత్తల రాక ప్రారంభమయింది.

Visakhapatnam CII Investors Summit : విశాఖపట్నంలో ఈనెల 14,15 తేదీల్లో రెండు రోజులపాటు జరుగనున్న 30వ భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు 2025 నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతప్రభుత్వం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సిఐఐ భాగస్వామ్యం తో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సిఐఐ సమ్మిట్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈసదస్సుకు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్లీనరీ హాల్ ప్రధాన వేదికగా ఉండగా దానికి అనుబంధంగా వివిధ హాళ్ళను ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ ప్లినరీ సెషన్లు జరగనున్నాయి.
మొదటి రోజు షెడ్యూల్
రెండు రోజుల సిఐఐ సమ్మిట్లో భాగంగా 14వ తేది శుక్రవారం ఉ.8.30 గం.ల నుండి ఈ.10.30 గం.ల వరకు ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ ప్లీనరీ హాల్ 5 లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.ఈ కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ , రాష్ట్ర గవర్నర్ జస్టీస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ , కేంద్ర మంత్రి పియూష్ గోయల్,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసాలు చేస్తారు. అనంతరం 10.30 గం.ల నుండి 11.45 గం.ల వరకు ఓపెనింగ్ ప్లినరీ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ అతిధులుగా కేంద్రమంత్రి పియుష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.అలాగే పలువురు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారు.అదే సమయంలో వివిధ కాన్పరెన్స్ హాల్లో వివిధ ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. సా.8 గం.ల వరకు జరగనున్నాయి.
రెండో రోజు షెడ్యూల్
రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా 15వతేది ఉదయం 9.30 గం.ల నుండి సాయంత్రం వరకూ వివిధ ప్లీనరీ హాల్లో పలు ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. అనంతరం సాయంత్రం 5 గం.ల నుండి 5.45.గంల వరకు ఈ రెండు రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు వేడుక ప్రధాన వేదికైన ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ ప్లీనరీ హాల్ 5లో జరగనుంది.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవ అతిథులుగా పాల్గోనున్నారు.అదే విధంగా సిఐఐ ఉపాధ్యక్షులు సుచిత్రా కె.యల్ల,సిఐఐ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.దినేష్ తదితరులు పొల్గోనున్నారు. అనంతరం సా.5.45 గం.లకు ఈ రెండు రోజుల సదస్సు ముగియనుంది.
ఏర్పాట్లు పూర్తి
రెండు రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్లో వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఇప్పటికే 13వ తేదీన పరిశ్రమల శాఖ 9 ఎంఓయులు,ఐఅండ్ఐ 3, ఆహారశుద్ధి శాఖ 4,ఇంధన శాఖ 6,సిఆర్డిఏ 8 ఎంఓయులు కుదుర్చుకోవడం జరిగింది.
కాగా 14వ తేది తొలిరోజు సదస్సులో సాయంత్రం 6.30 గం.ల నుండి రాత్రి 7.30. గం.ల మధ్య ప్రధాన వేదిక ప్రాంగణంలో హాల్ నంబరు 7లో పరిశ్రమల శాఖ 14, ఐఅండ్ ఐ 15,ఆహార శుద్ధి శాఖ 6,ఇంధన శాఖ 21 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనుంది.అదే విధంగా చివరి రోజైన 15వ తేది మధ్యాహ్నం 2.30.గం.ల నుండి 3.30 గం.ల మధ్య ప్రధాన వేదిక ప్రాంగణం హాల్ నంబరు 7లో పరిశ్రమల శాఖ 27 ఎంఓయులను,పర్యాటక శాఖ 21,ఐటి శాఖ 7,చేనేత జౌళి శాఖ రెండు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోనుంది.





















