AP Capital Vizag: ఏపీ క్యాపిటల్ అని గూగుల్ లో సెర్చ్ చేసినా విశాఖనే వస్తుంది: స్పీకర్ తమ్మినేని
ఏపీ రాజధాని అంటే విశాఖ అని అందరూ చెబుతున్నారని, దీనిపై ఏమైనా సందేహం ఉంటే గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తే మీకు విషయం అర్థమవుతుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
AP Speaker Tammineni Sitaram Vizag As AP Capital: విశాఖ రాజధానిగా పరిపాలన చేస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ప్రకటనపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం హర్షం వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. సీఎం నిర్ణయాన్ని నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు అన్నారు. తన విజన్ పై స్పష్టత ఉన్నందునే ఢిల్లీ వేదికగా సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ప్రకటన చేశారని తమ్మినేని అన్నారు. ఆ ప్రకటనతో ముఖ్యంగా కోస్తాం, ఉత్తరాంధ్ర జిల్లాల యువత కేరింతలు కొడుతోందన్నారు. గూగుల్ లో సెర్చ్ చేసినా ఏపీ రాజధాని విశాఖ అని వస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఏపీ రాజధాని అంశం ఇంకా సుప్రీంకోర్టు విచారణలో ఉందని, అప్పుడే ప్రకటనలు చేయడం సరికాదని టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు.
సామాజిక విప్లవానికి తెరలేపిన సీఎం జగన్..
శ్రీకాకుళంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్పీకర్ తమ్మినేని మాట్లాడారు. రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయంగా పెట్టుబడులు రావాలంటే విశాఖ లాంటి పరిపాలన రాజధాని ఉండాలని స్పీకర్ తమ్మినేని అభిప్రాయపడ్డారు. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ను డైవర్ట్ చేయడానికే సిఎం విశాఖ రాజధాని అని ప్రకటన చేశారని ప్రతిపక్షాలు అనడం పెద్ద జోక్ అన్నారు. ఇలాంటి దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. వాళ్లంతా తనకు స్నేహితులేనని, కానీ దానికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. చరిత్ర గతి తప్పడం అంటే ఇదే, చరిత్రకు వక్ర భాష్యం జోడించడం అంటూ మండిపడ్డారు. వారి మౌళిక సిద్ధాంతం ఏంటని ప్రశ్నించారు. ఇవాళ జరుగుతున్న పరిస్థితులను దేశంలోని పలువురు మేధావులు, మహిళలు, రైతులు అన్ని వర్గాల ప్రజానికం గమనించి.. మన కోసం అందర్నీ కాడని, ఒంటరిగా నిల్చున్న నేతను రక్షించుకోవడం మన బాధ్యత అన్నారు. ఈరోజే నిజమైన సామాజిక విప్లవానికి సీఎం జగన్ తెర తీశారని కొనియాడారు.
ఏపీ రాజధాని అని గూగుల్ లో సెర్చ్ చేయండి..
విశాఖపట్నం ఏపీ రాజధాని అని ఉత్తరాంధ్ర ప్రజల మనసులో నాటుకుపోయిందన్నారు. ఏపీ రాజధాని అంటే విశాఖ అని అందరూ చెబుతున్నారని, దీనిపై ఏమైనా సందేహం ఉంటే గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తే మీకు విషయం అర్థమవుతుందన్నారు. అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలని పాలనా రాజధాని, ఆర్థిక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తున్నామని సీఎం జగన్ గతంలోనే ప్రకటన చేశారని గుర్తుచేశారు. కానీ ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
రాబోయే ఎన్నికలు వ్యక్తుల మధ్య పార్టీల మధ్య కాదని.. పెత్తందారీ వర్గాలకి, పేదలకు మధ్య జరగనున్నాయి అని పేర్కొన్నారు. అమరావతిలో పేదలకు దళితులకు భూములు ఇస్తే సామాజిక సమతుల్యత తగ్గుతుందన్న టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. దళితులను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు ఏమని లోకేష్ ను పాదయాత్రకు పంపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.