Gudivada Amarnath: ఆ స్క్రిప్ట్ వదిలెయ్, మోదీకి చెప్తానంటూ లేనిపోని ప్రగల్బాలు వద్దు: పవన్ పై మంత్రి అమర్నాథ్ ఫైర్
Gudivada Amarnath Fires On Pawan Kalyan: ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం ఇష్టం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
Gudivada Amarnath Fires On Pawan Kalyan:
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన, మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ విషయం అర్థమవుతోందని అన్నారు. పవన్ కళ్యాణ్ బుధవారం ఎర్రబట్టిదిబ్బలను సందర్శించిన అనంతరం మాట్లాడిన మాటలపై అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. పర్యటిస్తే పర్లేదు కానీ, ప్రభుత్వాన్ని విమర్శించాలని, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నాలు మానుకుని.. నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే అందరికీ ప్రయోజనం ఉంటుందన్నారు.
ఎర్రమట్టి దిబ్బలు చారిత్రక ఆనవాళ్ళని దానిని ఆక్రమించుకుంటున్నారంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అక్కడ విఎంఆర్డిఏ (VMRDA) అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తప్పంటే ఎలా? అని పవన్ ను ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో భూ కుంభకోణాలు బయట పెడతానంటూ గత నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ వాటిని నిరూపించలేక బొక్క బోర్లా పడ్డారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. " మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా, వాస్తవాలు తెలుసుకొని, అవగాహన పెంచుకుని ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది." అని అమర్నాథ్.. పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు.
చంద్రబాబు హయాంలో ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలు కబ్జాకు గురైతే పెదవి మీ పని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలు వాస్తవ విరుద్ధమని, ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోవాలని అమర్నాథ్ కోరారు. ఆయన ఇప్పటివరకు పర్యటించిన ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి లోపం కనిపించకపోవడంతో, ఇక్కడ జరుగుతుందంతా ఎన్జీటీకి, ప్రధాని నరేంద్ర మోదీకి చెప్తానంటూ లేనిపోని ప్రగల్బాలు పలుకుతున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. " మీరు ఇక్కడ ఉండే ఒకటి రెండు రోజుల్లోనైనా మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోండి.. అవాస్తవాలను మాత్రం మాట్లాడకండి" అని పవన్ కళ్యాణ్ కు అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.
Also Read: AP News: బాల్య వివాహాల నియంత్రణపై ఏపీ సర్కార్ ఫోకస్ - వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం
ఎర్రమట్టి దిబ్బల్ని పరిశీలించిన జనసేన అధ్యక్షుడు
ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద అని, వాటిని సైతం ఏపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. భీమిలిలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను పవన్ బుధవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎర్రమట్టి దిబ్బలు 1,200 ఎకరాలు ఉండేవని, ఏపీ ప్రభుత్వం అంతా నాశనం చేశాక ఇప్పుడు 292 ఎకరాలే మిగిలాయని అన్నారు. ఎర్రమట్టి దిబ్బలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న జనసేనాని, వీటి రక్షణ గురించి పర్యావరణశాఖ దృష్టికి తీసుకెళ్తాం అన్నారు. భౌగోళిక గుర్తింపు ఉన్న ఎర్రమట్టి దిబ్బల వద్ద సైతం స్థిరాస్తి వెంచర్లు వేస్తు్న్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని పరిరక్షించకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామన్నారు.