AP News: బాల్య వివాహాల నియంత్రణపై ఏపీ సర్కార్ ఫోకస్ - వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం
Child Marriages in Andhra Pradesh: రాష్ట్రంలో బాల్య వివాహాల నియంత్రణకు త్వరలో పెద్ద ఎత్తున ప్రచార అవగాహనా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు.
Child Marriages in Andhra Pradesh: రాష్ట్రంలో బాల్య వివాహాల నియంత్రణకు త్వరలో పెద్ద ఎత్తున ప్రచార అవగాహనా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు.
బాల్య వివాహాల నియంత్రణకు కీలక నిర్ణయాలు...
బాల్య వివాహాల నియంత్రణపై యూనిసెఫ్ ప్రతినిధుల బృందంతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను నియంత్రించకుంటే ప్రసూతి మరణాలు (Meternal Mortality Rate) సంఖ్యను తగ్గించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం బాల్య వివాహాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వాటిని పూర్తిగా కట్టడి చేసేందుకు త్వరలో దీనిపై రాష్ట్ర వ్యాప్త ప్రచార అవగాహనా కార్యక్రమాలను చేపట్టనుందని పునరుద్ఘాటించారు. మధ్యలో చదువు మానివేసిన బాలికలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టి అన్ని విధాలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
బాలికా విద్యను ప్రోత్సహించడం తోపాటు బాల్య వివాహాలను నియంత్రించే లక్ష్యంతో మండలానికి ఒక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే వాటిని నియంత్రించేందుకు వీలుగా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబరును కూడా అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు సీఎస్ జవహర్ రెడ్డి.
వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి...
బాల్య వివాహాల నియంత్రణలో భాగంగా వివాహ రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేస్తున్నామని సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాల నియంత్రణకు సంబంధించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసేలా అవగాహనను కలిగించేందుంకు రెండు రోజుల్లో రాష్ట్ర స్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
బాల్య వివాహాలపై మార్గదర్శకాలు...
బాల్య వివాహాల నియంత్రణకు సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధం అవుతున్నాయని రాష్ట్ర స్త్రీ శిశు, సీనియర్ సిటిజెన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్ యూనిసెఫ్ చీఫ్ డా.జీలాలెమ్ బి.టాఫెస్సీ (Zelalem B.Taffesse)మాట్లాడుతూ.. బాల్య వివహాల నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఇప్పటికై దీనిపై 700 మంది జిల్లా అధికారులు, 500 మంది మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్బీసీ స్పెషలిస్ట్ సీమా కూమార్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నియంత్రణపై రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్ అధ్యక్షన సమావేశాలు నిర్వహించి అధికారులు అందరికీ ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి వివిధ లైన్ డిపార్టుమెంట్ అధికారులకు శిక్షణ, ఓరియంటేషన్ కార్యక్రమాలకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారానికి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.