AP Minister Dharmana: అభివృద్ధి అంటారు, మీ హయాంలో ఎంత మందికి ఇళ్లు ఇచ్చార్రా మీరు!- టీడీపీ నేతలపై మంత్రి ధర్మాన ఫైర్
AP Minister Dharmana Prasada Rao: అభివృద్ధి అభివృద్ధి అంటారు, మీ ప్రభుత్వంలో ఎంత మందికి ఇళ్లు ఇచ్చార్రా మీరు అంటూ టీడీపీ నేతలపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Dharmana Prasada Rao: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తమ పాలనలో ఏ లోపాలు ఉంటే సరిదిద్దుకునేందుకు సైతం సిద్ధంగా ఉంటామన్నారు. శ్రీకాకుళం హడ్కో కాలనీలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. నిద్రలేచినప్పటి నుంచి టీడీపీ నేతలు అభివృద్ధి, అభివృద్ధి అంటూ ప్రశ్నించడంపై ఘాటుగా స్పందించారు. రోజూ అభివృద్ధి అని వైసీపీపై విమర్శలు చేస్తుంటారు, ఇంతకీ మీ ప్రభుత్వంలో ఎంత మందికి ఇళ్లు కట్టించి ఇచ్చార్రా మీరు అంటూ టీడీపీ నేతలపై మంత్రి ధర్మాన ఫైర్ అయ్యారు.
సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థలలో ప్రసారమయ్యే విషయాలు, కనిపించే వార్తలను చూసి మోసపోవద్దని ప్రజలకు ఆయన సూచించారు. వాలంటీర్లు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. అధికార పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు సేవకుల్లాగా పనిచేయాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వంలో ఎంత మందికి ఇల్లు కట్టించి ఇచ్చింది, ఎంత మందిని అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. మీరు గతంలో టీడీపీకి ఓట్లేశారు. మీరు ఎంత అభివృద్ధి చెందారు, టీడీపీ నేతలు ఎన్ని ఇళ్లు కట్టించి ఇచ్చారు, ఏ ఒక్కరు బాగుపడలేదన్నారు. అందుకే మళ్లీ మీకు ఎందుకురా అధికారం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కొందరు కార్యాలయాలకు వెళ్లి అధికారులతో పని చేయించుకోలేకపోతున్నారు. అందుకే మా ప్రభుత్వం జగనన్న సురక్ష చేపట్టిందన్నారు. నిస్సహాయుల వద్దకు వెళ్లి, వారి పనులు చేసే పెట్టే కార్యక్రమం జగనన్న సురక్ష అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో సచివాలయాల వారీగా క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్‌లలో 11 రకాల ధ్రువీకరణ పత్రాలు ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఉచితంగా అందజేయనున్నట్లు మంత్రి ధర్మాన తెలిపారు.
వైసీపీకి ఓట్లు వేయకపోతే నష్టపోతారు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మీరు కనుక వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచి, ఓట్లు వేయకపోతే చాలా నష్టపోతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అర్హులైన పేదలకు ఇళ్లు కట్టిచ్చి ఇచ్చామన్నారు. మరోసారి నెగ్గినా, పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం, ఇందులో సందేహం లేదన్నారు. కానీ ఈసారి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబుగానీ, ఆ పార్టీ నేతలు మీకు ఏం చేశారు. ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని ఈ సందర్భంగా మంత్రి ధర్మాన స్థానికులకు ప్రశ్నించారు.
టీడీపీ నేతలకు భయపడి కొందరు వైసీపీ సమావేశాలకు రావడం లేదని, తన కార్యక్రమానికి సైతం రాకుండా డుమ్మా కొట్టారన్నారు. కొందరు విరేచనాలు అయ్యాయని సైతం చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు. కచ్చితంగా ఇదే పార్టీకి పనిచేస్తాను, పలానా పార్టీలో ఉంటారని మీరు ఎవరికీ బాండ్ పేపర్ మీద రాసివ్వలేదని, అభివృద్ధి చేసిన పార్టీని సపోర్ట్ చేయాలని సూచించారు. మీ ప్రాంతం మరింత డెవలప్ కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial