CM Jagan Davos Tour: దావోస్‌లో రెండు కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నాం- భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు వస్తాయి: అమర్‌నాథ్
విశాఖ మునిగిపోతుందని ఓ వర్గం మీడియా రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీసిందన్నారు ఏపీ మంత్రి అమర్‌నాథ్. దావోస్ వేదికగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై మీడియా సమావేశం నిర్వహించారయన.
వరదలొస్తే విశాఖపట్నం మునిగిపోతుందని, ప్రతిపక్ష పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశంతోనో లేక మరే దురుద్దేశాలతోనో ఓ వర్గం మీడియా పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేయడం వల్లే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రశ్నించారన్నారు ఏపీ ఐటీ, పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్. ఈ ప్రాంతం మీద ఇంతగా విషం చిమ్ముతున్న తీరు చూసి కళ్ళు చెమర్చాయ్ అని అన్నారు. ఐటీ హబ్ గా, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం ఇమేజ్ దెబ్బతీస్తే సహించలేకపోయానన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అడిగిన ప్రశ్నలకు వాస్తవ పరిస్థితులు వివరించడంతోపాటు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరానని చెప్పారు.
రాజకీయాలు ఎన్ని ఉన్నా రాష్ట్రాభివృద్ధి విషయంలో అంతా కలిసి రావాలని, రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ఎవరూ ఫణంగా పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు అమర్‌నాథ్. స్వార్థం కోసం రాష్ట్రానికి, విశాఖకు ఎవరూ హాని చేయవద్దన్నారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో మంత్రులు, అధికార యంత్రాంగం అంతా దావోస్ వెళ్ళిందన్నారు. వ్యక్తిగత ప్రమోషన్ కోసం కాదన్నారు.
విశాఖను యూనికార్న్ హబ్‌గా తయారు చేయాలన్నదే జగన్ విజన్ అని, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఏపీ ప్రపంచానికే దిక్చూచి కాబోతుందని అన్నారు. డీకార్బనైజ్డ్ మెకానిజంలో ఆంధ్రప్రదేశ్ ఐకాన్‌గా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఉన్న అవకాశాలు, సహజ వనరులు వివరించి, పెట్టుబడులు ఆహ్వానించామని తెలిపారు. దేశంలోనే రెండో అతి పెద్ద సముద్రతీరం.. పోర్టు ఆధారిత ఇండస్ట్రీయల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని పేర్కొన్నట్టు వివరించారు.
అయిదు రోజులు పాటు జరిగిన సదస్సులో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశామన్నారు అమర్‌నాథ్. ఏపీలో అవకాశాలను అంచనా వేసుకోవడానికి ఇది దోహదపడిందన్నారు. దాదాపు 50మంది మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులతో భేటీ జరిగిందని... ఏపీలో ఐటీకి ఎక్కువ అవకాశాలు ఉన్న విశాఖను యూనికార్న్ హబ్‌గా చేయలనే లక్ష్యంతో యూనికార్న్, ఓయో సంస్థ ప్రతినిధులు, స్టార్టప్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైనట్టు వివరించారు. ఏపీ పెవిలియన్‌లో 35 సమావేశాలు జరిగాయన్నారు.
వైద్యం, విద్య, గ్రీన్ ఎనర్జీలపై ఫోకస్
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మూడు ప్రధాన అంశాలపై ఫోకస్ చేసినట్టు వివరించారు అమర్‌నాథ్. హెల్త్‌కు సంబంధించిన సదస్సులో ప్రపంచస్థాయి వ్యక్తులతోపాటు ముఖ్యమంత్రి జగన్ గ్లోబల్ లీడర్‌గా పాల్గొన్నారన్నారు. హెల్త్‌కు సంబంధించిన సదస్సులో తాను, విద్యకు సంబంధించిన సదస్సులో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నట్టు తెలిపారు. ప్రధానంగా డీకార్బనైజ్డ్ ఎకానమీ మీద దృష్టి సారిస్తూ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో ఏపీ కొత్త ట్రెండ్ సృష్టించిందన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రొడక‌్షన్‌కు సంబంధించి షోకేస్‌గా కర్నూలు ప్రాజెక్టు నిలుస్తుందన్నారు. కర్నూలులో నిర్మిస్తోన్న విండ్, హైడల్, సోలార్ పవర్ ప్రాజెక్టులో అనుసరిస్తున్న టెక్నాలజీతో 33,000 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు.
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికి పైలట్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, సీఐఏ కలిపి ప్రపంచస్థాయి సదస్సులో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న గ్రీన్ ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్ ముఖద్వారంగా ఉండాలని, ప్రపంచానికే దిక్చూచీ కాబోతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ కూడా ప్రస్తావించడం జరిగిందని గుర్తు చేశారు.
గ్రీన్ స్టీల్‌ప్లాంట్, గ్రీన్ ఎస్‌ఈజెడ్‌లను ప్రమోట్ చేయాలని ప్రపంచ వేదికపై జగన్ మాట్లాడారని... ప్రస్తుతం విశాఖలో ఉన్న ప్లాంట్‌ను విస్తరణకు మరో వెయ్యి కోట్లుకు పెంచుతూ ఆదిత్య మిట్టల్ ప్రకటన కూడా చేసినట్టు వివరించారు. దావోస్‌లో అదానీ, గ్రీన్ కో, అరబిందోతో దాదాపు రూ. లక్షా 25వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకుందన్నారు.
అవిగో.. ఇవిగో అంటూ ప్రజలను మభ్యపెట్టం
గత పాలకులు మాదిరిగా అవిగో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అబద్ధాలు చెప్పబోమన్నారు అమర్‌నాథ్. ఊహల్లో అంచనాలు అంతకన్నా వేయమన్నారు. వాస్తవాలను మాత్రమే ప్రజల ముందు ఉంచుతామన్నారు. దావోస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం ఎంత? ఈ రాష్ట్రం ఎంత మేరకు ఒప్పందాలు చేసుకుందనే దానిపై పోలిక ఉండదన్నారు అమర్‌నాథ్. అదానీ, అరబిందో, గ్రీన్ కో కంపెనీలతో ఒప్పందాలకు చేసుకోవడానికి దావోస్ వెళ్లాలా అంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు. ఆ సంస్థలకు ఇక్కడ ఉన్న అవకాశాలు తెలుసు కాబట్టే ఒప్పందాలు చేసుకున్నారన్నారు. మిగతా ప్రపంచ స్థాయి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు, అవకాశాలు చూసుకున్న తర్వాతే నిర్ణయాలు జరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అందర్నీ ఆహ్వానించామన్నారు అమర్‌నాథ్. వాళ్లందరికీ, సదస్సుకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాస్తుందన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక పెట్టుబడుల కోసం వెళ్లిన మొట్ట మొదటి పర్యటన ఇదని.... మంచి సమావేశాలు జరిగాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దావోస్ వెళ్ళి వారు ఏం చేశారో, ఏ భోజనం చేశారు, ఎక్కడ స్నానం చేశారు.. ఇలాంటివన్నీ హైలెట్ చేశారన్నారు. తాము అలాంటివి రాయాలాని అడగడం లేదన్నారు.