Amaravati Lands: అమరావతి భూములు కొంటారా ? ఎకరం పది కోట్లే !
అమరావతి భూముల వేలానికి రంగం సిద్ధమైంది. 2,480 కోట్ల సమీకరణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఏపీ రాజధానిగా అమరావతిలో నిర్మాణాలతోపాటు, మౌలిక సదుపాయాలనూ ఏర్పాటు చెయ్యాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అయితే దానికి కావాల్సిన నిధుల సమీకరణకు కూడా అమరావతి భూములపైనే ఆధారపడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో ఉన్న భూముల్లో ఎకరా 10 కోట్ల చొప్పున వేలం వేసి 2480 కోట్ల రూపాయలను సమీకరించాలనేదే ప్రభుత్వ యత్నంగా తెలుస్తుంది.
అమరావతి భూముల్లో 248 ఎకరాలను అమ్మడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇలా భూములను వేలం వెయ్యడానికి ఈ మధ్యనే అంటే 06. 06. 2022న మున్సిపల్ శాఖ ద్వారా జీవో నెంబర్ 389ని జారీ చేశారు. ఇప్పుడు దాని ఆధారంగానే వచ్చే నెలలో అంటే జూలైలో అమరావతి భూముల్లో 248 ఎకరాలను వేలం వేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అమరావతి నిర్మాణానికి ఆశించిన విధంగా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో సొంతంగానే నిధులు సమకూర్చుకోవడానికి జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. ఒకవేళ ఈ ప్రయత్నం విజయవంతం అయితే వచ్చే ఏడాది కూడా మరికొన్ని భూములను వేలం వేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
వేలంవేసే భూములు ఇవే :
అమరావతిలో గతంలో మెడిసిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలతోపాటు, లండన్ కింగ్స్ కాలేజీ కోసం కేటాయించిన 148 ఎకరాలను ఈ తొలి విడత వేలంలో అమ్మడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. ఓవరాల్‌గా ఇలా విడతల వారీ అమరావతి భూముల్లో 600 ఎకరాలు అమ్మడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వాటి వల్ల వచ్చే నిధులను అమరావతి నిర్మాణం కొరకు వాడాలని చూస్తుంది. మరి ప్రభుత్వ ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.