Chandrababu: జగన్ ఓ సైకో, జలగ! అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్పనా?: శ్రీకాకుళంలో చంద్రబాబు
Andhra Pradesh News: సాధ్యమైతే సంపద సృష్టించాలి కానీ, అప్పులు తెచ్చి బటన్ నొక్కడం పెద్ద గొప్పా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.
TDP Chief Chandrababu News: శ్రీకాకుళం: ఏపీలో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న పదం బటన్ నొక్కడం. తాను గత ఐదేళ్లలో ఎన్నో బటన్లు నొక్కి కోట్లాది మందికి లబ్ధి చేశానని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రతి సభలోనూ చెబుతున్నారు. ఎన్నికల్లో మీరు రెండు బటన్లు నొక్కాలని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిస్తున్నారు. బటన్ నొక్కడంపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తీవ్ర స్థాయిలో స్పందించారు. అప్పులు తీసుకొచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపటం, సంపద సృష్టించడం గొప్ప విషయం అన్నారు.
శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి..
శ్రీకాకుళంలో బుధవారం నాడు (ఏప్రిల్ 24న) మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ ఓ సైకో అని, ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ అని చంద్రబాబు విమర్శించారు. ఒక్కఛాన్స్ అని రాష్ట్రాన్ని కోలుకోలేనంత నాశనం చేసిన వ్యక్తి జగన్, ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ సర్కార్ జగన్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను, టీడీపీ మొదట్నుంచీ మహిళా పక్షపాతి అన్నారు. ఆడబిడ్డలకు టీడీపీ పుట్టినిల్లు అని, ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చింది టీడీపీ అని పేర్కొన్నారు. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వకుండా అప్పు ఇచ్చిన వ్యక్తి జగన్ అని, తాను పెద్దకొడుకులా మీ కుటుంబాలకు సేవ చేస్తానన్నారు. వైసీపీ పాలనలో తాము ఎదుర్కొన్న కష్టాలను, తమ సమస్యలను చంద్రబాబుకు మహిళలు వివరించారు.
వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయండి.. చంద్రబాబు పిలుపు
‘మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు నేటి నుంచి 19 రోజులు మిగిలి ఉన్నాయి. మీ ఓటుతో వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలి. గత ఐదేళ్లలో అప్పులు తీసుకురావడం, బటన్ నొక్కడం తప్ప అభివృద్ది చేయడం చేతకాలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక అమ్మకు వందనం ద్వారా ఒక్కో బిడ్డకు రూ.15 వేలు ఇస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. అర్హులైన నిరుపేదలకు 2, 3 సెంట్లు భూమి ఇచ్చి, గృహాలు నిర్మిస్తాం. చేతకాని ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగింది. రాజధాని లేకుండా చేసిన ఘనుడు జగన్’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు పింఛన్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకే ఉందని, పెన్షన్లను మొదలు పెట్టిందే ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తుచేశారు. రూ.200 పింఛన్ ను 2000 చేసింది తానేనని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక నెలకు రూ.4000 పింఛన్ ఇంటి వద్ద అందిస్తామన్నారు. దివ్యాంగులకు నెలకు రూ.6000ల పింఛన్ ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబ భవిష్యత్తుకు గ్యారంటీ లభిస్తుంది. సాకులు చెప్పి పేదలు, వృద్ధుల పింఛన్లు ఎగ్గొట్టే తరహా వ్యక్తిని తాను కాదన్నారు.