రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ వ్యాఖ్యలు, అచ్చెన్నాయుడూ నోరు అదుపులో పెట్టుకో: డిప్యూటీ స్పీకర్
చంద్రబాబు చేసిన మంచి ఏమిటో ప్రజల దగ్గరికి వెళ్లి చెప్పుకునే దమ్ము ఉందా? అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు.
రాజకీయ లబ్ధి కోసం లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై అవాస్తవాలు చెబుతున్నారని, ఎన్ని పాదయాత్రలు చేసినా అధికారంలోకి టీడీపీ రాలేదని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రను ఆహ్వానిస్తున్నమని అయితే పాదయాత్రలో వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. 25 వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు, 5 లక్షల ఉద్యోగాలు, ఎల్ఈడీ బల్బులు అన్నీ ఊర్లలో మీరు చేస్తే 2019 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. చేసింది చెప్పడానికి ఏమీ లేక రాజకీయ లబ్ది కోసం అవాస్తవాలు మాట్లాడటం సరికాదన్నారు. ఎన్ టి ఆర్ మద్యపాన నిషేదం చేస్తే.. దాన్ని ఎత్తేసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. దిక్కు తోచక.. అధికారం కోసం, నీతి నియమాలకు తిలోదకాలు ఇచ్చి, సిద్ధాంతాలను పక్కన పెట్టి, ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో కలిసి పోయే మీరు మా మీద విమర్శలు చేయడం సరికాదన్నారు.
చంద్రబాబు చేసిన మంచి ఏమిటో ప్రజల దగ్గరికి వెళ్లి చెప్పుకునే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. తాము గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం.. టీడీపీ వారు ఎందుకు వెళ్లలేక పోతున్నారని నిలదీశారు. "జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రజల్లోకి వెళ్లి అడగండి.. ఎవరికైనా లంచాలు ఇచ్చారా అని అడగండి" అని టీడీపీ నాయకులను ఉద్దేశించి అన్నారు. " వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను చూసి చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను చూసి లోకేష్ పాదయాత్రలు చేస్తామంటే అవ్వదని.. ఆ నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని అన్నారు. ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా అధికారం వైసీపీదే అని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఉన్న ప్రచారాల పిచ్చి లోకేష్ కు కూడా ఉందని విమర్శించారు.
"రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన ఘటన గుర్తు చేసుకోండి. మీ మీటింగ్ లు ఇరుకైన రోడ్ల మీద పెట్టి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, మీరు ఎక్కడ కాలు పెడితే అక్కడ అరిష్టమని ప్రజలు భావిస్తున్నారని" అన్నారు. జీఓ 1 పైన చేస్తున్న రగడ సరికాదని, ఆ జీఓ ఉండటం వల్లే తారకరత్నను సకాలంలో తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇంకిత జ్ఞానం లేకుండా పోలీస్ వారిపట్ల చులకనగా మాట్లాడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. పోలీసులు లేకుండా మీటింగ్, రోడ్డు మీద కార్యక్రమాలు చేయగలరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని అరే, ఒరే అని మాట్లాడటం సరికాదనీ, ఆ మాటలు తాము మాట్లాడలేమా అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారో ప్రజలకు తెలుసు అని అన్నారు. ఎవరికీ టీడీపీ వారు మంచి చేయలేనందున ఆ వర్గాల ప్రజలు 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తూ విద్య, వైద్యాన్ని సామాన్యులకు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఆరోగ్య పరంగా మనో దైర్యం కల్పించి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని అన్నారు. మీ పాదయాత్రలో ప్రజలకు ఇబ్బందులు పడకుండా చేయాలన్నారు. లోకేష్ అసమర్థుడు అని విమర్శించారు. ఆయన అసమర్థ రాజకీయాలు ప్రజలకు, వారి పార్టీ నాయకులకు కూడా తెలుసునని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.