Andhra Pradesh: పశ్చిమ ఆస్ట్రేలియాతో 8 ఎంవోయూలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం
AP govt signs 8 MoUs with Western Australia: పరిశ్రమలు, నైపుణ్యం, విద్య, శిక్షణ, గనులు, ఖనిజాలు, తయారీ రంగాల్లో పరస్పర సహకారం దిశగా ఏపీ ప్రభుత్వం, పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య 8 ఒప్పందాలు జరిగాయి.
విశాఖపట్నం: ఏపీ, పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య బంధం మరింత బలోపేతమైంది. రాష్ట్రంలో గనులు, ఖనిజాలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, పరిశ్రమలు, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక సహకారం, నైపుణ్యాలు అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. ఏపీ, పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య ఇదివరకే ఒప్పందం ఉంది. దాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వివిధ అంశాలలో సహకారానికి సంబంధించి రెండు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. మొత్తం 8 అంశాలలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ రోజర్ కుక్ సారథ్యంలో ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం శనివారం విశాఖపట్నం రాడిసన్ హోటల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్ నాథ్ లతో సమావేశమైంది.
పరిశ్రమలు, నైపుణ్యం, విద్య, శిక్షణ, గనులు, ఖనిజాలు, తయారీ రంగాల్లో పరస్పర సహకారం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మాల, భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ వీ.జీ వెంకటరెడ్డి, ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, విద్యుత్ శాఖ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వితేజ్ ఇమ్మాడి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఆస్ట్రేలియా ప్రతినిధులకు ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు. 100 మందికి పైగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రతినిధులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు, పారిశ్రామికవేత్తల నడుమ జరిగిన వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో మొత్తం 8 ఒప్పందాలు కుదిరాయి.
పారిశ్రామిక ప్రగతివైపు ఏపీ పరుగులు: మంత్రి గుడివాడ అమర్ నాథ్
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ... ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతివైపు పరుగులు పెడుతుందన్నారు. అపార సహజవనరులు, మౌలిక సదుపాయాలు,పారదర్శక పాలన, పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వక వాతావరణం వల్ల ఏపీకి పెట్టుబడులు రానున్నాయన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాతో ఒప్పందం వల్ల కొన్ని కీలక రంగాలలో కలిసి పని చేస్తూ ముందుకు సాగే అవకాశం ఉంటుందన్నారు. అంతకుముందు ఎంవోయూ సదస్సులో ఆర్థిక, నైపుణ్య శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఏపీలో పట్టభద్రులకు కొదువలేదన్నారు. కానీ, వారికి కావలసిన నైపుణ్యం కొరత ఉన్న నేపథ్యంలో పశ్చిమ ఆస్ట్రేలియా తోడ్పాటు దాన్ని అధిగమించేందుకు కలిసి ముందుకు వెళతామన్నారు.
భారత ప్రభుత్వం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కొనసాగడం చాలా సంతోషంగా ఉందన్నారు పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ రోజర్ కుక్. విశాఖలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్–పశ్చిమ ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాలలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాలలో ఏపీ ఒకటన్నారు. విద్యుత్, విద్య, నైపుణ్యం సహా పలు కీలక రంగాలలో పరస్పర సహకారం మరింత పెరుగుతుందన్నారు. తమకు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశమని, భారత్‌లో అతిపెద్ద భాగస్వామి రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు.
ఏపీ ప్రభుత్వం, పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన 8 ఒప్పందాలు ఇవే :
1. ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఏఐసీఎస్) డైరెక్టర్ పర్సెస్ ష్రాఫ్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం. అంతర్జాతీయ విద్య, నైపుణ్య సహకారం కోసం పశ్చిమ ఆస్ట్రేలియా, ఆంధ్రప్రదేశ్ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది.
2. 'ఫ్యూచర్ బ్యాటరీ'తో ఏపీఈడీబీ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం. విద్యుత్ కు సంబంధించిన సవాళ్ళను అధిగమించే విధానాలలో పరిశోధనాత్మక తోడ్పాటు.
3. 'స్పేస్ ఏంజిల్' సంస్థతో ఏపీఈడీబీ ఒప్పందం. ఏరో స్పేస్ రంగానికి చెందిన అంతరిక్ష సాంకేతిక అంశంలో పరస్పర సహకారం చేసుకోవాలి.
4. 'విలేజ్ ఎనర్జీ' సంస్థ సీఈవో వేన్ లూబిస్ కాస్ తో ఏపీఈడీబీ ఎంవోయూ. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అవగాహన ఒప్పందం.
5. 'ఫినిక్స్ అకాడమీ'తో నైపుణ్య, శిక్షణ రంగానికి సంబంధించిన పరస్పర అవగాహన ఒ్పందం. నైపుణ్యం, ఒకేషనల్ ట్రైనింగ్ కి సంబంధించిన సహకారం దిశగా అంగీకారం.
6. పశ్చిమ ఆస్ట్రేలియాలోని విద్యుత్ రంగానికి సంబంధించిన 'ఆస్ట్రేలియన్ ఎనర్జీ స్టోరేజ్' కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీ ఎండీ పీయూష్ మాధుర్, ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ సవరపు ప్రసాద్ సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
7. 'హెల్త్ ఇంటిగ్రా ప్రైవేట్ లిమిటెడ్' అనే వైద్య పరికరాల తయారీ సంస్థతో ఏపీఈడీబీ ఒప్పందం. అత్యాధునిక పరికరాలకు సంబంధించిన సాంకేతికత పలు కీలక అంశాలలో పరస్పర అవగాహనతో కలిసి పనిచేయడానికి అంగీకారం.
8. పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన 'ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ' (సీసీఐడబ్ల్యూఏ) వాణిజ్య పెట్టుబడుల హెడ్ మైకేల్ కార్టర్ తో ఏపీఈడీబీ ఒప్పందం. మత్స్య రంగానికి సంబంధించిన అంశాలలో కలిసి పని చేయనున్నట్లు వెల్లడించారు.