Alluri Seetarama Raju District News: జి.మాడుగుల KGBV విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై ప్రభుత్వం సీరియస్- బాధ్యులపై చర్యలకు ఆదేశం
Andhra Pradesh: కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించిన వివాదం సంచలనంగా మారింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలకు ఆదేశించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటన సంచలనంగా మారుతోంది. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ అయినట్టు సమాచారం. వెంటనే విచారణ చేపట్టి చర్యలకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రతిజ్ఞకు హాజరు కాలేదని ప్రత్యేకాధికారిణి సాయి ప్రసన్న విద్యార్థినుల జుట్టు కత్తిరించారు.
ఈ నెల 15న కార్తీక పౌర్ణమి రోజున 23 మంది విద్యార్థులు కాలేజీకి ఆలస్యంగా వచ్చారు. వీరిపై ప్రత్యేకాధికారి సాయి ప్రసన్న, మరో ఉపాధ్యాయురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చేయి చేసుకున్నారు. వారిని అక్కడే నిలబెట్టేశారు. ఎండకు తట్టుకోలేక విద్యార్థినులను సొమ్మసిల్లి పడిపోయారు.
మధ్యాహ్న భోజన విరామ సమయానికి 18 విద్యార్థుల జుట్టును కత్తిరించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడకు వచ్చి సిబ్బందిని నిలదీశారు. కాలేజీకి ఆలస్యంగా రావడమే కాకుండా మధ్యాహ్నం భోజనం సమయానికి కూడా జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారని అందుకే ప్రసన్న చెప్పారు. అందుకే వారి జుట్టు కత్తిరించినట్టు వివరించారు.
ఆదివారం ఒక్కసారిగా వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ప్రధాన మీడియాలో కూడా విమర్శలు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులను ఆ కాలేజీకి పంపించి విచారణ చేపట్టింది. జిల్లా అధికారులు నేరుగా విద్యార్థినులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు కూడా కాలేజీని సందర్శించారు.
అమానవీయంగా విద్యార్థినుల జుట్టు కత్తిరించిన సాయి ప్రసన్న, మరో ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తాము విచారించిన తర్వాత తెలుసుకున్న వివరాలను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. ఈ సమస్యే కాకుండా ఇతర సమస్యల గురించి కూడా విద్యార్థులు తెలిపారు. వాటిని కూడా నివేదికలో ప్రస్తావించామన్నారు. తరచూ భోజనంలో పురుగులు వస్తున్నాయని, భోజనం కూడా సరిపోయేంత పెట్టడం లేదని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. నీటి సదుపాయం కూడా అంతగా లేదని అంటున్నారు. అందుకే ఆ రోజు ఆలస్యమైందన్నారు.
మంత్రి కూడా ఈ ఘటనపై స్పందించారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు తప్పు చేస్తే వేరేలా చెప్పాలే తప్పా ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. మరోవైపు విద్యార్థినుల పేరెంట్స్ అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. వారికి విద్యార్థి సంఘాలు ఇతర వర్గాలు మద్దతు తెలిపాయి.
ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించడం, అధికారులను అక్కడకు పంపించడం చర్యలకు సిఫార్సు చకచకా జరగడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు శాంతించారు. చర్యలు తీసుకోకుంటే తమ ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరింతారు. ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా సీరియస్ అయింది. పూర్తి వివరాలు అందివ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది.
Also Read: వైరల్ అవుతున్న ఫ్లిప్‌కార్ట్ 'మ్యాజిక్ ఇంక్' యాడ్ - ఆ వీడియో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు!