Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
AP CM Chandra Babu: రోజు రోజుకు పెరిగిపోతున్న అత్యాచార కేసులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి వారిని నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ధి వస్తుందని కామెంట్ చేశారు.
Andhra Pradesh CM Chandra Babu Warning : ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్యకాలంలో తరచూ అత్యాచారం, హత్య కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా చింతలగొర్లివాని పాలెంలో ప్రారంభించిన చంద్రబాబు మద్యం, ఇసుక అక్రమార్కులపై, ఆడపిల్లలను ఇబ్బంది పెట్టే వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
మద్యం, గంజాయి మత్తులో ఇలాంటి దుశ్చేష్టలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు నెమ్మదిగా చెప్పామన్నా ఆయన... ఇకపై తప్ప చేయాలంటే వెన్నులో వణుకుపుట్టే ట్రీట్మెంట్ ఉంటుందన్నారు.
మద్యం,గంజాయి తాగిన మత్తులో ఆడపిల్లలను విలాస వస్తువులుగా చూసే వాళ్లు జాగ్రత్త పడాలన్నారు. ఆడపిల్లలు విలాస వస్తువులు కారని హెచ్చరించారు. నాలుగేళ్ల చిన్నారిపై కూడా అత్యాచారం చేస్తున్నారంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లు ఒకరిద్దర్ని నడి రోడ్డుపై ఉరి తీస్తే మిగతా వాళ్లకు బుద్ధి వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి తప్పులు చేయొద్దని ఇప్పటి వరకు కాస్త మెత్తగా చెప్పామని ఇకపై కఠినంగా ఉంటామన్నారు చంద్రబాబు. ఆలాంటి ఆలోచన చేయాలంటేనే భయపడేలా చేస్తామన్నారు. ఆడవాళ్లను విలాస వస్తువులుగా చూసే వాళ్లను కూడా చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడినా, మద్యం వ్యాపారాల్లో దందాలు చేసినా, బెల్టు షాపులు పెట్టినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు చంద్రబాబు. పార్టీ నేతలైనా వదిలి పెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇసుకలో అక్రమాలకు పాల్పడినా, అక్రమంగా రవాణా చేసి డబ్బులు వసూలు చేసినా పీడీ యాక్ట్ పెడతామన్నారు.