Amadalavalasa Constituency: శ్రీకాకుళం జిల్లాలో ఈ నియోజకవర్గం ప్రత్యేకం - ఆ కథ ఏంటంటే?
Amadalavalasa Politics: శ్రీకాకుళం జిల్లాలోని మరో నియోజకవర్గం ఆమదాలవలస. 1952లో తొలి ఎన్నికలు జరిగితే.. మూడేళ్ల తరువాత అంటే 1955లో ఈ నియోజకవర్గం ఏర్పాటై ఎన్నికలు జరిగాయి.
Amadalavalasa Political History: శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గం ఓ ప్రత్యేకం. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో 1952లో తొలిసారి ఎన్నికలు జరిగితే.. మూడేళ్ల తరువాత అంటే 1955లో ఈ నియోజకవర్గం ఏర్పాటై ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 15 సార్లు ఇక్కడ ఎన్నికలు జరగ్గా, ఆరుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. మరో ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు విజయాన్ని దక్కించుకున్నారు. ఆరుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి తమ్మినేని సీతారాం విజయం సాధించగా, ఇదే కుటుంబానికి చెందిన తమ్మినేని పాపారావు మూడుసార్లు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,72,262 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,35,876 మంది ఉన్నారు. మహిళ ఓటర్లు 1,36,355 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఈ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు.
పార్టీల విజయం ఇలా
ఈ నియోజకవర్గం ఏర్పాటైన తరువాత తొలిసారి 1955లో ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తమ్మినేని పాపారావు విజయం సాధించారు. కేఎల్పీ నుంచి పోటీ చేసిన కేఏ నాయుడిపై 4,475 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తమ్మినేని పాపారావు మరోసారి విజయం సాధించారు. జనసంఘ నుంచి పోటీ చేసిన డి.జగన్నాథరావుపై పాపారావు 3,067 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1967లో జరిగిన ఎన్నికల్లో తమ్మినేని పాపారావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసిన డి.జగన్నాథరావుపై 3,365 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1972లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పైడి శ్రీరామ్మూర్తి ఇక్కడి నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తమ్మినేని పాపారావు 4,546 ఓట్ల తేడాతో తొలిసారి ఓటమిని చవి చూశారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్(ఆర్) నుంచి పోటీ చేసిన పైడి శ్రీరామ్మూర్తి కాంగ్రెస్(ఐ) నుంచి పోటీ చేసిన పీవీ అప్పలనాయుడిపై 3,375 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తమ్మినేని సీతారాం ఇక్కడ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పైడి శ్రీరామమూర్తిపై 4273 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1985లో జరిగిన ఎన్నికల్లో తమ్మినేని సీతారామ్ మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పైడి శ్రీరామమూర్తిపై 2129 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పైడి శ్రీరామ్మూరి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన టి సీతారామ్‌పై 3496 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తమ్మినేని సీతారామ్ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బి రాజగోపాలరావుపై 2767 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో తమ్మినేని సీతారామ్ మరోసారి విజయం దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బి చిట్టిబాబుపై 5234 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో తమ్మినేని సీతారామ్ గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బి సత్యవతిపై 1511 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బి సత్యవతి గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీ చేసిన తమ్మినేని సీతారామ్‌పై 3686 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బొడ్డేపల్లి సత్యవతి మరోసారి ఇక్కడ విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన తమ్మినేని సీతారామ్‌పై 16,209 ఓట్ల తేడాతో ఆమె ఓటమిపాలయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన కూన రవికుమార్ ఇక్కడ విజయం సాధించారు. వైసీపీ నుంచి బరిలోకి దిగిన సమీప ప్రత్యర్థి తమ్మినేని సీతారామ్‌పై 5449 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తమ్మినేని సీతారామ్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన కూన రవికుమార్‌పై 13,991 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
తమ్మినేని కుటుంబానికి అండగా
ఈ నియోజకవర్గం తమ్మినేని కుటుంబానికి ముందు నుంచీ అండగా ఉంటూ వస్తోంది. నియోజకవర్గం ఏర్పాటైన తరువాత జరిగిన మొదటి మూడు ఎన్నికల్లోనూ తమ్మినేని పాపారావు విజయం సాధించారు. ఆ తరువాత తమ్మినేని సీతారామ్ ఆరుసార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. ఐదుసార్లు టీడీపీ నుంచి, ఒకసారి వైసీపీ నుంచి విజయం సాధించారు. నాలుగుసార్లు ఓటమిపాలయ్యారు. ఇక్కడి నుంచి గెలుపొందిన తమ్మినేని సీతారామ్ టీడీపీ హయంలో మంత్రిగా పని చేయగా, ప్రస్తుతం వైసీపీ హయాంలో స్పీకర్‌గా పని చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పైడి శ్రీరామమూర్తి మూడుసార్లు విజయం సాధించారు. బొడ్డేపల్లి సత్యవతి ఇక్కడి నుంచి రెండుసార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎవరు జెండాను ఎగురవేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.