Alluri District News: ‘కలెక్టర్ గారూ మాకు మంచినీళ్లివ్వండి’ చేతులెత్తి వేడుకున్న గిరిజనులు
Alluri Sitaramaraju District అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ కొండ శిఖర గ్రామాలైన బూరిగా చిన్నకోనిలల్లో కరెంటు సౌకర్యం లేక 12 గంటల వెలుతురు మాత్రమే చూస్తున్నారు.
![Alluri District News: ‘కలెక్టర్ గారూ మాకు మంచినీళ్లివ్వండి’ చేతులెత్తి వేడుకున్న గిరిజనులు Alluri Sitaramaraju district tribes urges collector to supply drinking water Alluri District News: ‘కలెక్టర్ గారూ మాకు మంచినీళ్లివ్వండి’ చేతులెత్తి వేడుకున్న గిరిజనులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/c9d8afcede561eccbf5d82a3ee7c26261706013188409234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
‘‘జిల్లా కలెక్టర్ గారు. చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. 75వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో అయినా మాకు నీళ్లు ఇవ్వండి. రాత్రి పూట వెలుగును ప్రసాదించండి’’ అంటూ గ్రామస్థులు వేడుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము చీకట్లో బతుకుతున్నామని.. కనీసం మంచినీళ్లు అయినా ఇవ్వాలని వారు వేడుకున్నారు. చిన్నకోనిల, బూరిగ ఆదివాసీ గిరిజన మహిళలు నెత్తి మీద బిందె పెట్టుకొని, చేతులు జోడించి.. జిల్లా కలెక్టర్ గారిని వేడుకుంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ కొండ శిఖర గ్రామాలైన బూరిగా, చిన్నకోనిలల్లో దాదాపు 70 కుటుంబాలు 250 మంది జనాభా కరెంటు సౌకర్యం లేక 12 గంటల వెలుతురు మాత్రమే చూస్తున్నారు. తాగేందుకు రక్షిత మంచినీరు కూడా వారికి సరఫరా లేదు. పశువులు తాగే నీటినే వారు కూడా వడకట్టి తాగాల్సి వస్తోంది. తరచూ అనారోగ్యంతో సతమతమవుతూ ఉన్నామని గ్రామస్థులు వాపోయారు. ఎస్టీ కమిషన్, ప్రస్తుతం ఎమ్మెల్సీ రవి బాబు, ఐటీడీఏ పీవో రోనంకి గోపాలకృష్ణ ఇంతకుముందే తమ గ్రామాన్ని సందర్శించారని.. తమకు వసతులు కల్పించాలని గ్రామస్థులు వేడుకున్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా బోరు తీసి కేసింగ్ వేశారని చెప్పారు. కానీ, ఆరు నెలలు అవుతున్నప్పటికీ.. బోరు మోటారు బిగించలేదని అన్నారు.
‘‘దేశంలో 75వ గణతంత్ర వేడుకలు జరుపుతున్న సందర్భంలో మా ఆదివాసి గిరిజన గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాము. కనీసం తాగుదాం అనుకుంటే నీరు కూడా లేని పరిస్థితి. ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ పథకం పెట్టినా.. బోర్ వేసి మోటర్ బిగించకుండా వదిలేశారు. జిల్లా కలెక్టర్ గారు కరెంట్ ఇవ్వకపోయినా.. కనీసం మాకు తాగడానికి మంచి నీళ్ల సౌకర్యం కల్పించండి మహాప్రభో’’ అంటూ చిన్నకోల బూరిగ ఆదివాసి గిరిజన మహిళలు వేడుకున్నారు. ఆదివాసి గిరిజన మహిళలు జర్నీ పోలమ్మ, సోమల పోలమ్మ, 10వ వార్డు సభ్యుడు సోముల అప్పలరాజు, చిన్న కాలనీ గ్రామ పెద్దలు కొనపర్తి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)