TDP On Karanam Dharma Sri : కరణం ధర్మశ్రీ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయలేదు, వికేంద్రీకరణపై నమ్మకం లేకే- ప్రణవ్ గోపాల్
TDP On Karanam Dharma Sri : నాటకాలపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఉన్న ప్రేమతో రాజీనామాను కూడా నాటకీయంగా చేశారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు.
TDP On Karanam Dharma Sri : ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు మరో మలుపు తిరిగింది. ఉత్తరాంధ్రకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాన్ని సంధించారు. తాజాగా వికేంద్రీకరణ జేఏసీ ఏర్పాటు చేశారు. జేఏసీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో విశాఖలో రాజధాని ఏర్పాటుకు రాజీనామాకైనా సిద్ధమని ప్రకటించారు. అయితే వైసీపీ రాజీనామా డ్రామా ఆడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది.
నాటకీయ రాజీనామా
వికేంద్రీకరణపై ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీకి నమ్మకం లేకే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయలేదని TNSF రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. నాటకాలపై కరణం ధర్మశ్రీకి ఉన్న ప్రేమతో రాజీనామాను కూడా నాటకీయంగా చేశారని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ధర్మాన, బొత్స వారి కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నారు గానీ ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఏంలేదన్నారు. మంత్రి అమర్ నాథ్ వికేంద్రీకరణ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పని చేసే మీలాంటి నాయకుల వల్లే ఉత్తరాంధ్రలో ఇంకా వెనుకబాటుతనం ఉందని ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు.
నాన్ పొలిటికల్ జేఏసీలో అంతా వైసీపీ నేతలే
"నాన్ పొలిటికల్ జేఏసీ అంటూ ఏర్పాటు చేసి అందరూ వైసీపీ నాయకులనే మాట్లాడించారు. అది నాన్ పొలిటికల్ జేఏసీ కాదు ఉత్తరాంధ్ర బ్రో** జేఏసీ. అందులో స్వార్థం తప్ప అభివృద్ధి లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?. పాదయాత్రను అడ్డుకుంటామన్న మంత్రులను కోర్టు ధిక్కార నేరం కింద అరెస్టు చేయాలి. మంత్రులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటే డీజీపీ ఏం చేస్తున్నట్లు?. మంత్రి అమర్ నాథ్ కు చిత్తశుద్ధి ఉంటే విశాఖలో రోడ్లను బాగు చేసి అప్పుడు విశాఖ గురించి మాట్లాడితే బాగుంటుంది. వికేంద్రీకరణ అంటూ మంత్రి అమర్ నాథ్ జగన్ కి చెంచాగిరి చేస్తున్నారు." - ప్రణవ్ గోపాల్
నాన్ పొలిటికల్ జేఏసీ
వికేంద్రీకరణ ఉద్యమానికి మద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో తన రిజైన్ లెటర్‌ను వికేంద్రీకరణ సాధన సమితికి అందజేశారు. అవసరమైతే రాజీనామా చేస్తానంటూ మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రకటించిన గంటల్లోనే మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు అదే ప్రకటన చేశారు. నాన్ పొలిటికల్ జె.ఏ.సీ. ఆవిర్భావ సభలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి హీట్ పుట్టించారు. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే ముమ్మాటికీ అమరావతి రాజధానికి తాము వ్యతిరేకిస్తామన్నారు. దమ్ముంటే రాజీనామాకు అచ్చెన్నాయుడు సిద్ధ పడాలని సవాల్ చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాకు తాను సిద్ధమని అదే వేదికపై ప్రకటించారు. అంతే కాదు స్పీకర్ ఫార్మాట్‌లో జె.ఏ.సీ.కన్వీనర్ కు రాజీనామా లేఖ అందజేశారు. కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకించే నాయకులను రాజకీయాల నుంచి వెలివేయాలని ప్రజలకు ధర్మశ్రీ పిలుపునిచ్చారు. వారం రోజుల పాటు నియోజకవర్గ కేంద్రాల్లో విస్త్రతంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహణకు అధికార పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
Also Read : వికేంద్రీకరణ మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా- జేఏసీకి లెటర్ అందజేత
Also Read : Avanthi Srinivas: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, వైజాగ్ జేఏసీ మీటింగ్ లో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్