Pawan Kalyan: ఈ నెల 31న విశాఖలో జనసేన భారీ బహిరంగ సభ... సభావేదికపై కొనసాగుతున్న ఉత్కంఠ...
విశాఖలో ఈ నెల 31న జరిగే జనసేన బహిరంగ సభ వేదికపై ఉత్కంఠ నెలకొంది. సభాస్థలిని మార్చాలని పోలీసులు కోరినా జనసేన నేతలు మాత్రం అక్కడే సభ నిర్వహిస్తామని పట్టుబడుతున్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 31న జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. విశాఖలో సభ వేదికపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద సభా వేదిక ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. అయితే సభావేదిక మార్చాలని పోలీసులు జనసేన నేతలకు సూచించారు. కానీ జనసేన నేతలు మాత్రం పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా సభ అక్కడే నిర్వహిస్తామని పట్టుబడుతున్నారు. బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తూ, కరపత్రాలు కూడా పంచారు. జనసేన సభకు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
31-10-2021, మ.2 గం.లకు గాజువాక స్టీల్ ప్లాంట్ ఆవరణలో జరగనున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభ తాలూకా పోస్టర్ మరియు కరపత్రాలు, మాడుగుల నియోజకవర్గ నాయకులు శ్రీ బొయిదాపు కిరణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు విడుదల చేశారు. pic.twitter.com/dUgz2v79QT
— JanaSena Party (@JanaSenaParty) October 29, 2021
ఈ నెల 31న భారీ బహిరంగ సభ
విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు చేపట్టిన ఆందోళనకు జనసేన ఇప్పటి వరకూ పరోక్షంగా మద్దతు ఇచ్చింది కానీ ఆ పార్టీ నేతలు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనలేదు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొనడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఈ నెల 31న విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆహ్వానం మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సభలో పాల్గొంటారు. ముందుగా ఉక్కు కర్మాగారం వద్ద పరిరక్షణ సమితి ప్రతినిధుల్ని కలిసి వారితో మాట్లాడుతారు. విశాఖ ఉక్కు భావోద్వేగాలతో కూడిన అంశమని ఈ ఏడాది ఫిబ్రవరి 9న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన పవన్‌కల్యాణ్ ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
పవన్ పర్యటనతో మరింత బలం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని పవన్ కల్యాణ్ కేంద్రాన్ని కోరారు. 34 మంది ప్రాణ త్యాగాలతో ఈ కర్మాగారం ఏర్పాటైందన్న విషయాన్ని అమిత్‌షాకు వివరించారు. కానీ విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పులేదు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగానే వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో నిరసనలు జరుగుతున్నాయి. పవన్ పర్యటనతో విశాఖ ఉక్కు ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని స్టీల్ ప్లాంట్ కార్మికులు భావిస్తున్నారు.
Also Read: మాజీ మిస్ తెలంగాణ మరోసారి ఆత్మహత్యాయత్నం... కీసర బ్రిడ్జిపై నుంచి మున్నేరులో దూకిన యువతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి