BJP On Ysrcp Govt : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఏపీ, వైసీపీ సర్కార్ రూ.70 వేల కోట్లు దారి మళ్లించింది : పురంధేశ్వరి
BJP On Ysrcp Govt : ఏపీ ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉందని బీజేపీ నేత పురంధేశ్వరి ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో ముంచారని వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు.
BJP On Ysrcp Govt : విశాఖ రుషికొండ ఏ1 కన్వెన్షన్ హాల్ లో బీజేపీ(BJP) విశాఖ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి(Purandheswari) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి అక్కడి కార్యకర్తల కృషే కారణమన్నారు. ఏపీ ఆర్థిక క్రమశిక్షణ కోల్పోయి అప్పుల పాలైందని ఆరోపించారు. చంద్రబాబు దిగిపోయే సమయానికి రెండున్నర లక్షల కోట్ల అప్పు ఉండగా, ఈ మూడేళ్లలో అది ఆరున్నర లక్షల కోట్లు పెరిగిందని పురంధేశ్వరి విమర్శించారు. దీంతో ఒక్కో పౌరునిపై లక్షా ఇరవై వేల రుణభారం పడిందన్నారు.
రూ.70 వేల కోట్లు దారి మళ్లింపు
"విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం శోచనీయం. ఆర్థిక లోటు తగ్గించాలని కాకుండా అప్పు ఎలా తేవాలో సీఎం జగన్(CM Jagan) ఆలోచిస్తున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో మాత్రమే ఏపీలో అభివృద్ధి జరుగుతుంది. కొన్ని కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా శూన్యం. కేంద్రం నిధులలో రూ.70 వేల కోట్లు దారి మళ్లించారని కాగ్(CAG) నివేదిక చెబుతోంది. " అని పురంధేశ్వరి ఆరోపించారు.
పరిశ్రమల స్థాపనకు వెనకడుగు
ఏపీలో జరుగుతున్న దౌర్జన్యాలతో పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావటం లేదని పురంధేశ్వరి విమర్శించారు. స్వార్థ పూరిత రాజకీయాలను అడ్డుకోవటానికి బీజేపీ బలోపేతం కావాలన్నారు. కేంద్రం ఏ సాయం చేయటం లేదని వైసీపీ సర్కారు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదని పురంధేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ భూములను కూడా తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకునే స్థితికి సర్కార్ దిగజారిందంటూ విమర్శలు చేశారు. అధికార వైఎస్ఆర్సీపీపై ప్రజలకు రోజురోజుకూ నమ్మకం సన్నగిల్లుతోందని విమర్శించారు. అందించాల్సిన స్థాయిలో కేంద్రం సాయం చేయడం లేదంటూ బీజేపీపై అపవాదులు వేస్తున్నారని పురంధేశ్వరి అన్నారు. ఒకవేళ కేంద్రం నిధులు ఆపేస్తే ఏపీలో అభివృద్ధి సాధ్యమా అంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులు తప్పా రాష్ట్ర వాటా ఏంలేదన్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో గుప్పెడు మట్టిని కూడా రోడ్లపై వేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రానికి మంచి దిక్కు అవసరమంటూ పురంధేశ్వరి అన్నారు.