YSRCP News: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ ఎంపీ, మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మేడా రాఘునాథ్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది.
YSRCP Rajya Sabha Candidates : వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ ఎంపీ, మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (Yv Subbareddy), పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు (Golla Baburao), మేడా రాఘునాథ్ రెడ్డి (Meda Raghunath Reddy)ని అభ్యర్థులుగా ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం 16న దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. ఈ నెల 20న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం గడవు విధించింది. ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేశ్ ల పదవీ కాలం ఏప్రిల్ తో ముగియనుంది. మొత్తంగా ఏప్రిల్‌లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీకాలం ముగియనుంది.
వైసీపీకి పూర్తి బలం
అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేస్తున్న వైసీపీ...మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ నెలలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ మూడు స్థానాలను తన ఖాతాలో పడేలా జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు గెలడానికి బలం ఉండటంతో ముగ్గుర్ని బరిలోకి దించుతున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, కడప జిల్లాకు చెందిన మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడు మేడా రఘునాథ్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. సామాజిక సమీకరణాలతో పాటు ప్రాంతీయ లెక్కలు వేసుకున్న తర్వాత సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి అభ్యర్థిత్వానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరి పేర్లను అధికారికంగా ప్రకటించింది.
ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లు ఇవే
ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నేత, నెల్లూరు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది. రాజ్యసభ ఎన్నికల ముగిసిన వెంటనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దించింది వైసీపీ. వైసీపీకి పూర్తి బలం ఉండటంతో వారి ఎన్నిక లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వైసీపీ అధినేత జగన్...ఎక్కడో తేడా కొడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడంతో వారంతా...వైసీపీ రాజ్యసభ అభ్యర్థులకు ఓట్లు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినా... ఎంపీ స్థానం చేజారిపోయే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ పకడ్బందీగా వ్యూహాలు రూపొందిస్తున్నారు.
రెండు రెడ్లు, ఒక ఎస్సీ ఛాన్స్
సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలను లెక్కలోకి తీసుకున్న తర్వాతే... సీఎం జగన్ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఉత్తరాంధ్ర నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, రాయలసీమ నుంచి మేడా రఘునాథ్ రెడ్డి, ఆంధ్రా ప్రాంతం నుంచి టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. గొల్ల బాబురావు ఎస్సీ సామాజికవర్గం అయితే, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డిలు...ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు.