Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Papa Prakshalana Pooja : తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేశారని, ఆ పాప ప్రక్షాళణ కోసం తాము పూజలు చేస్తాంటూ ట్వీట్ వేశారు జగన్.
YS Jagan Call For Papa Prakshalana Pooja : రాష్ట్రవ్యాప్తగా ఈనెల 28న వైసీపీ నేతలంతా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని, చంద్రబాబు చేసిన పాపం ప్రక్షాళణ చేసేందుకు ఈ పూజలు చేయాలని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్. తిరుమల లడ్డూల తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు పాపం చేశారని అన్నారాయన. ఆ పాప ప్రక్షాళణ కోసం తమ పార్టీ నేతలు పూజలు చేయాలని పిలుపునిచ్చారు.
తిరుమల పవిత్రతను,
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2024
స్వామివారి ప్రసాదం విశిష్టతను,
వెంకటేశ్వరస్వామి వైభవాన్ని,
టీటీడీ పేరు ప్రఖ్యాతులను,
వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను,
రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య…
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా, స్వామివారి ప్రసాదం విశిష్టతను మంటగలిపేలా, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని తక్కువ చేసేలా, టీటీడీ పేరు ప్రఖ్యాతులను చెడగొట్టేలా సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు జగన్. వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో ఆయన చెడగొడుతున్నారని చెప్పారు. లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో కావాలని అబద్ధాలాడుతున్నారని, జంతువుల కొవ్వుతో కల్తీ జరగకపోయినా జరిగినట్టుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేశారంటూ జగన్ ట్వీట్ వేశారు.
ఇది వైసీపీ దీక్ష..
ఓవైపు పవన్ కల్యాణ్ కూడా పాప ప్రక్షాళణ దీక్ష చేపట్టారు. వైసీపీ చేసిన తప్పుకి ప్రక్షాళణగా తాను దీక్ష చేపట్టానన్నారు పవన్. ప్రత్యేక పూజలు చేసి, గుడిమెట్లు శుభ్రం చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ దీక్షలు మొదలవుతున్నాయి. పవన్ కి పోటీగా ఈనెల 28న పాప ప్రక్షాళణ పూజలు చేస్తామంటున్నారు జగన్. చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళణగా తమ పూజలు ఉంటాయన్నారు.
తిరుమలలో నెయ్యి కల్తీ జరిగింది ఎప్పుడు, జులైలో రిపోర్ట్ లు బయటకు వస్తే ఆలస్యంగా ఎందుకు బయటపెట్టారని గతంలో జగన్ ప్రశ్నించారు. టీటీడీ ఈవో కల్తీ జరిగిందని చెబుతుంటే, చంద్రబాబు మాత్రం జంతువుల కొవ్వు కలిసిందని అంటున్నారని, ఇందులో ఏది నిజం అని కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలకు పరిహార పూజలంటూ వైసీపీ కొత్త పల్లవి అందుకోవడం విశేషం.
Also Read: వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి గుర్తించి పలుమార్లు వెనక్కి పంపించాం - కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
జగన్ కూడా పాల్గొంటారా..?
అయితే ఈ పూజల్లో జగన్ పాల్గొంటారా లేదా అనేది తేలాల్సి ఉంది. జగన్ ట్వీట్ కి సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఈ దీక్షల్లో జగన్ పాల్గొంటారా..? ఒకవేళ పాల్గొంటే ఇంటి దగ్గరే గుడి సెట్ వేసుకుంటారా, లేక నిజంగానే ఆలయానికి వస్తారా, వస్తే సతీ సమేతంగా వస్తారా, ఒంటరిగా వస్తారా అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మొత్తమ్మీద లడ్డూ వ్యవహారం ఏపీలో తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. ఇటు పవన్ దీక్షలు, అటు వైసీపీ పోటీ పోటీ దీక్షలు ఈ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.
Also Read: తిరుమల లడ్డు కల్తీ ఉద్దేశ్యపూర్వక నేరమే! సంచలన వ్యాఖ్యలు చేసిన అవిముక్తేశ్వరానంద్ సరస్వతి