జనసేన సభ విజయం వెనుక మహిళలు, ధన్యవాదాలు తెలిపిన పవన్ !
జనసేన సభలో మహిళలు కీలక పాత్ర పోషించారా... రోడ్ షో మొదలుకొని, సభ పూర్తయ్యే వరకు మహిళలు ఎక్కువ మంది జనసేనాని వెంటే నడిచారని పార్టి వర్గాలు అంటున్నాయి.
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన సమావేశంలో మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు నిర్వహించిన సభలో జనసేన వీర మహిళలు అత్యంత కీలక పాత్ర పోషించారు. పవన్ విజయవాడ ఆటోనగర్ నుంచి నిర్వహించిన రోడ్ షోలో మచిలీపట్నం వరకు దారి పొడవునా మహిళలే అధిక సంఖ్యలో పవన్‌కు అభివాదం చేశారు. పవన్ రాక కోసం మహిళలు పెద్ద ఎత్తున ఎదురు చూపులు చూశారు.
విజయవాడ కానూరు వద్ద రోడ్డుకు ఇరువైపులా మహిళలు పెద్ద ఎత్తున పవన్‌కు అభివాదం చేయటంతోపాటుగా హారతులు పట్టారు. ఇక సభలో కూడా మహిళలు అధిక సంఖ్యలో కనిపించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మచిలీపట్నం సభా ప్రాంగణం వద్దకు ఉదయం నుంచే మహిళలు వచ్చారని అంటున్నారు. ఎండ వేడి కారణంగా మధ్యాహ్నం సమయంలో కొంత మేర పలచబడినప్పటికి, ఆ తరువాత నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అందులో వీర మహిళలు కీలకంగా మారారు. ఈ విషయాలను పార్టీ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతుంది.
రాత్రి 11.30 గంటల తరువాత సభ పూర్తయినప్పటికి మహిళలు ఎక్కువగానే కనిపించారు. దీంతో పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. వీర మహిళలకు సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మహిళల గ్యాలరీల్లోకి ఇతరులు, యువకులు రాకుండా ప్రత్యేకంగా బారికేడ్‌లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో సభ పూర్తయ్యే వరకు మహిళలకు ఇబ్బందులు లేకుండా పార్టీ నిర్వాహకులు ప్రత్యేకంగా శ్రద్ద చూపించారని చెబుతున్నారు.
వీర మహిళలకు పవన్ స్పెసల్ థ్యాంక్స్
సభ విజయవంతమైన తర్వాత అధినేత పవన్ కల్యాణ్ కూడా వీర మహిళలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. నిర్వాహకులు పగడ్బంధీగా ఏర్పాట్లు చేయటం వలన మహిళలు ఇబ్బంది లేకుండా ఉండగలిరాని,నిర్వాహకులను పవన్ అభినందించారు. వీర మహిళలను ఉద్దేశించి పవన్ తన ప్రసంగంలో పదే పదే కొనియాడారు. పార్టీ పదేళ్ల ప్రస్థానంలో వీర మహిళలు చూపించిన తెగువ, సాహసం మరువలేనిదని పవన్ అన్నారు. సభా ప్రాంగణంలో మహిళలు హర్షాధ్వానాలు చేశారు. సభకు పవన్ రాగానే గ్యాలరీల్లో ఉన్న మహిళలు సైతం ఉత్సాహంతో కేరింతలు కోట్టారు. పవన్‌కు జై కొడుతూ నినాదాలు చేశారు.
అది సినిమా ప్రభావమా....
పవన్ సభలో ఎక్కువ శాతం యువత ఉండటం కామన్. పవన్ బయటకు వస్తే ఆయన్ని చూసేందుకు ఎగబడేది కూడా ఎక్కువ శాతం యువతే. అందులోనూ ఓటు హక్కు కూడా లేని వారి ఎక్కువగా పవన్ సభలకు రోడ్ షోలకు వస్తారనే ప్రచారం కూడా ఉంది. పవన్ గతంలో నిర్వహించిన సభల్లో కూడా ఎక్కువ శాతం మంది యువతే అధికంగా ఉన్నారు. అయితే పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్టణంలో నిర్వహించిన సభలో మాత్రం డిఫరెంట్‌గా జరిగిందని పార్టీ వర్గాలు భావివిస్తున్నాయి. అందులో కీలక పాత్ర మహిళలదేని అంటున్నారు. రోడ్ షోతోపాటుగా సభలో కూడా మహిళలే ఎక్కువగా కనిపించటం, ప్రత్యేకమని చెబుతున్నారు.
సినిమా స్టార్‌గా ఉన్న పవన్ మచిలీపట్నం వంటి ప్రాంతానికి అరుదుగా రావటంతో సినిమా క్రేజ్ కోణంలోనే మహిళలు పవన్‌ను చూసేందుకు వచ్చారా అనే విషయాలను కూడా నాయకత్వం ఆరా తీస్తోంది. సినిమా కోణంలో పవన్ ను చూసేందుకు వస్తే మహిళలు అర్ధరాత్రి వరకు సభలో ఉండాల్సిన అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. పవన్ తిరిగి వెళ్లినప్పటికి, సభా ప్రాంగణం నుంచి మహిళలు బయటకు వచ్చి తమ గమ్యస్థానాలకు వెళ్ళారు. ఇలాంటి ప్రచారాలు నేపథ్యంలో జనసేన పదో వ్యవస్థాపక దినోత్సవం వేదికగా వీర మహిళల ఫాలోయింగ్ పెరగటం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది..